తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!

ఉత్తరాంధ్ర క‌ల్పవ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ఇల‌వేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - జాతర విశిష్టత, ఆలయ చరిత్ర వివరాలు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Sirimanotsavam 2024
Sirimanotsavam 2024 (Getty Images)

Sirimanotsavam 2024: పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో సంబరం. జీవితంలో ఒక్కసారైనా ఆ జాతరను చూసి తరించాలని తపించే వారు ఎందరో. నలభై రోజుల పాటు సాగే ఈ పండుగలో అతి ముఖ్యమైన ఘట్టం సిరిమాను ఉత్సవం. ఈ కథనంలో సిరిమాను ఉత్సవ విశేషాలు తెలుసుకుందాం.

రాష్ట్ర పండుగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరిపే పైడితల్లి సిరిమాను ఉత్సవంలో పాల్గొనడానికి విజయనగరంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

సిరిమాను జాతర విశిష్టత
గజపతి రాజుల ఆడపడుచు అయిన పైడితల్లి అమ్మవారి జాతర గజపతి రాజుల వారసుల ఆధ్వర్యంలో సాగుతుంది. ఆలయ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో సాగే ఈ ఉత్సవంలో ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇస్తారు. ఇంతటి మహిమాన్వితమైన పైడితల్లి సిరిమాను ఉత్సవం వెనుక ఉన్న చారిత్రక గాథ గురించి తెలుసుకుందాం.

గజపతుల వారి ఆడపడుచు
విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగరం రాజు బొబ్బిలి రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపుగా ధ్వంసమైంది. ఎంతోమంది బొబ్బిలి సైనికులు యుద్ధంలో మరణించారు. ఆ సమయంలో రామరాజు భార్య, అతని సోదరి అయిన పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమయంలో పైడిమాంబ పూజ నిర్వహిస్తుండగా అతని సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఈ యుద్ధంలో తాండ్ర పాప రాయుడు రాజు విజయ రామరాజును సంహరించాడు. సోదరుని మరణ వార్త తెలిసి పైడిమాంబ మూర్ఛపోతుంది. అదే దుఃఖంతో ఆమె తనువు చాలిస్తుంది.

స్వప్న సందేశం
పైడిమాంబ తన మరణానంతరం ఆ రాజ్యంలో ఒక సైనికుడైన పతివాడ అప్పల నాయుడుకి కలలో కనిపించి ఓ సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే ఆ ప్రాంతంలోని ఓ సరస్సులో పడమర వైపు నుంచి వెతికితే తన విగ్రహం దొరుకుతుందని, ఆ విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. ఆ ఆలయంలో నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది. అందుకే పైడితల్లి అమ్మవారి ఆలయం సరస్సు సమీపంలో నిర్మించడం జరిగింది. ఆనాటి నుంచి ఆలయంలో నిత్య పూజోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

సిరిమానోత్సవం
ఏడాదిలో ఒకసారి దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం రోజు అమ్మవారికి సిరిమాను జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతర కళ్లారా చూడటానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, దేశ విదేశాల నుంచి కూడా అసంఖ్యాక భక్తజనం తరలి వస్తారు.

ఎన్నో కీలక ఘట్టాలు
విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఈ జాతరలో ఆద్యంతం ఎన్నో విశేషాలు మరెన్నో కీలక ఘట్టాలు. సెప్టెంబర్ 20 భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ప్రారంభమైన ఈ జాతరలో అమ్మవారికి పండుగ రాట వేసి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 14 న అమ్మవారి తొల్లెళ్ల ఉత్సవం జరుగనుండగా, ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15న జరగనుంది. అక్టోబర్ 22వ తేదీ మంగళవారం పెద్ద చెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 27 సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు జరుగనుంది. అక్టోబర్ 29న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 30న బుధవారం వనం గుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలతో ఈ ఏడాదికి పండుగ ఉత్సవాలు ముగుస్తాయి.

సిరిమాను ఉత్సవమే కీలకం
పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమాను ఉత్సవమే కీలకం. ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇవ్వనున్నారు. సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు, అంజలి రధాలు సంప్రదాయబద్దంగా ఊరేగుతాయి.

జాతర దర్శన ఫలం
జీవితంలో ఒక్కసారైనా పైడితల్లి అమ్మవారి జాతరను కళ్లారా చూస్తే సిరి సంపదలకు లోటుండదని, గౌరవ ప్రతిష్ఠలు, పదవీ యోగాలు కలుగుతాయని విశ్వాసం. త్వరలో జరుగనున్న పైడితల్లి అమ్మవారి జాతరను కనులారా వీక్షిద్దాం. తరిద్దాం. జై పైడితల్లి!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details