VISAKHAPATNAM BELLAM VINAYAKUDU :ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్రతీరాన ఉన్న జాలరి పేటలో ఈ బెల్లం గణపతి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతారు.
చంద్రుడు ప్రతిష్ఠించిన గణపతి
బెల్లం గణపతి దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో దేవతలు శివుని ప్రతిష్ఠించి పూజించారంట. అయితే కాలక్రమేణా సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది. దీనికి కలత చెందిన చంద్రుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట! అప్పుడు చంద్రుడు, శివుని ఆలయం సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అక్కడ తిరిగి వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరాడు. అంతట శివుడు ప్రస్తుతం వినాయకుడు దేవాలయం ఉన్న ప్రదేశం వద్ద స్వయంభువుగా వెలిశాడు. అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడే వినాయకుని కూడా ప్రతిష్ఠించాడంట!
విభిన్న రూపంతో అలరించే బెల్లం వినాయకుడు
మామూలుగా దేవాలయంలో మనం చూసే గణపయ్య విగ్రహం తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే, బెల్లం వినాయకుని తొండం మాత్రం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గణపతి ఉపాసకులు కూడా ఈ విషయాన్ని నమ్ముతారు. అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు.