తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

గణపతిని ఎందుకు పూజించాలి? ఎలా పూజించాలి? – చవితి సమస్త సమాచారం మీకోసం - Vinayaka Chavithi 2024 - VINAYAKA CHAVITHI 2024

Vinayaka Chavithi 2024 : వినాయకచవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూరా, వాడవాడనా మండపాలు వెలిశాయి. గణపతి విగ్రహాలు కూడా మండపాలకు చేరుతున్నాయి. ఇక మిగిలింది ప్రతిష్ఠించడమే. అయితే, చవితి వేడుకలంటే ఆటపాటల సంబరాలే కాదు, అత్యంత నిష్ఠతో గణపయ్యను పూజించడం! మరి, ఆ లంబోదరుడి నవరాత్రుల విశిష్టత గురించి మీకు ఎంత వరకు తెలుసు? ఏకదంతుడి పూజా విధానం, ధూప, దీప, రూప, నైవేద్యాలపై మీకున్న పరిజ్ఞానం ఎంత? సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

HISTORY OF VINAYAKA CHAVITHI
Vinayaka Chavithi 2024 Pooja Vidhanam Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 4:46 PM IST

Vinayaka Chavithi 2024 Pooja Vidhanam Telugu: ప్రతి సంవత్సరమూ భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు మొదలవుతాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. మరి, ఈ గజాననుడిని ఎందుకు పూజించాలి? ఎలా పూజించాలి? ఆయన రూపాలెన్ని? వాటి ప్రత్యేకతలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి? :విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. భక్తులకు జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, మోక్ష ప్రాప్తి కలగాలన్నా, వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

గణపతిని పూజిస్తే మూడు గ్రహాల అనుగ్రహం!:జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. కుజగ్రహం అనుగ్రహం వల్ల వివాహ, అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కేతుగ్రహం అనుగ్రహం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. గణపతి ఆరాధనలో ఈ మూడు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలా, ఒక్క పార్వతీతనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని అంటారు.

పూజా సామాగ్రి ఇదే:పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, 21 రకాల పత్రి, ఉద్ధరిణ, ఉండ్రాళ్లు, పాయసం, కుడుములు, గారెలు, పులిహోర, మోదకాలు మొదలైన పిండివంటలు సిద్ధం చేసుకోవాలి.

పూజా విధానం ఇలా!

  • చవితి రోజున తెల్లవారు జామునే లేచి ఇంటిని, పూజగదిని శుభ్రపరిచి తలస్నానం ఆచరించాలి.
  • కొత్త బట్టలు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి.
  • కుటుంబమంతా కలిసి పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో మండపం ఏర్పాటు చేసుకోవాలి.
  • పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి.
  • దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి.
  • రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లుపోసి, పైన కొబ్బరికాయ, రవిక ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.
  • ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. దీపారాధన అనంతరం ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

శ్లోకం: "ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం" అని చదువుకోవాలి.

ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః

అని మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను పఠించాలి.

  • ఓం గోవిందాయ నమః,
  • ఓం విష్ణవే నమః
  • ఓం మధుసూదనాయ నమః
  • ఓం త్రివిక్రమాయ నమః
  • ఓం వామనాయ నమః
  • ఓం శ్రీధరాయ నమః
  • ఓం హృషీకేశాయ నమః
  • ఓం పద్మనాభాయ నమః
  • ఓం దామోదరాయ నమః
  • ఓం సంకర్షణాయ నమః
  • ఓం వాసుదేవాయ నమః
  • ఓం ప్రద్యుమ్నాయ నమః
  • ఓం అనిరుద్ధాయ నమః
  • ఓం పురుషోత్తమాయ నమః
  • ఓం అధోక్షజాయ నమః
  • ఓం నారసింహాయ నమః
  • ఓం అచ్యుతాయ నమః
  • ఓం ఉపేంద్రాయ నమః
  • ఓం హరయే నమః
  • ఓం శ్రీ కృష్ణాయ నమః
  • ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఈ కింది మంత్రాలను చెబుతూ కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లాలి.

  • ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః
  • ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
  • ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
  • ఓం శచీపురందరాభ్యాం నమః
  • ఓం అరుంధతీవశిష్ఠాభ్యాం నమః
  • ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
  • నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

భూతోచ్ఛాటన: "ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతాషామ్ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే". ఈ మంత్రాన్ని చదువుతూ అక్షింతలు తలపై నుంచి వెనుకకి వేసుకొవాలి.

ప్రాణాయామం : "ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమ్ ఆపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా యః స్మరేత్ విరూపాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః" అని నాలుగు దిక్కులా ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.

తర్వాత ఇలా:శుద్ధిచేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినడం లేదా చదువుకోవడం చేయాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు పాడాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేయాలి.

తొమ్మిది రోజులు – రోజుకో తీరు :గణేష్ నవరాత్రుల్లో ఒక్కో రోజున ఒక్కో పేరుతో వినాయకుడిని పూజిస్తారు. రోజుకో తీరున ప్రత్యేక పూజలు చేస్తారు. పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.

మొదటి రోజు: తొలి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడిని "వరసిద్ధి వినాయకుడు" అంటారు. ఆ పేరుతోనే పూజిస్తారు. తొలి రోజున గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్లు సమర్పిస్తారు.

రెండో రోజు:నవరాత్రుల్లో రెండో రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు వినాయకుడిని "వికట వినాయకుడు" అంటారు. ఆ పేరుతోనే పూజిస్తారు. "లంబోదరశ్చ వికటో" అని వినాయకుడి షోడశ నామాలతో ఆయనను స్మరించాలి. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి, మొదటిరోజున పూజించినట్లే పూజించాలి. రెండో రోజున విఘ్నేశ్వరుడికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు పూజ లక్ష్యం సమాజం దుష్ట కామాన్ని విడనాడటం.

మూడో రోజు: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు – అంటే భాధ్రపద శుద్ధ షష్ఠి నాడు ఆ గణపతిని "లంబోదర వినాయకుడు" అని పిలుస్తారు. క్రోధాసురుడిని వధించిన లంబోదరుడిని మూడో రోజు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి. మూడో రోజున స్వామి వారికి పేలాలను నివేదిస్తారు. ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టాలి.

నాలుగో రోజు: భాధ్రపద శుద్ధ సప్తమి నాడు ఆ గణపతిని "గజానన వినాయకుడి"గా పూజిస్తారు. నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే.

ఐదో రోజు: భాధ్రపద శుద్ధ అష్టమి నాడు ఆ వినాయకుడిని "మహోదర వినాయకుడు" అంటారు. మోహాసురిడికి భ్రాంతిని తొలిగించి తనలో ఐక్యం చేసుకుంటాడు గణపయ్య. ఈ రోజున స్వామికి కొబ్బరి కురిడి నైవేద్యంగా పెడతారు. ఈరోజు పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే.

ఆరో రోజు: భాధ్రపద శుద్ధ నవమి నాడు ఆ వినాయకుడిని "ఏకదంత వినాయకుడి"గా పూజిస్తారు. ఈరోజున స్వామి మదాసురిడి మదం అణిగేలా చేశాడు. ఈ రోజున స్వామి వారికి నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలను ప్రసాదాలుగా పెట్టవచ్చు. ఈ రోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడం.

ఏడో రోజు: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అంటే భాద్రపద శుద్ధ దశమి నాడు ఆ లంబోదరుడిని "వక్రతుండ వినాయకుడి"గా పిలుస్తారు. మత్సరాసురుడిని నేలకు జార్చి వాహనంగా చేసుకుంటాడు గణపతి. ఆ రోజున బొజ్జ గణపయ్యకు అరటి మొదలైన పండ్లను నైవేద్యంగా పెడతారు. నేటి పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే.

ఎనిమిదో రోజు: భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఆ గణపయ్యను "విఘ్నరాజ వినాయకుడి"గా పిలుస్తారు. ఈ రోజున మమతాసురుడి కోరలు తీసేస్తాడు వినాయకుడు. ఈ రోజున స్వామి వారికి సత్తు పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపమే. ఇది ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ అంతరార్థం.

తొమ్మిదో రోజు: భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆ లంబోదరుడిని "ధూమ్రవర్ణ వినాయకుడి"గా పూజిస్తారు. ఈ రోజున స్వామి వారికి నేతి అప్పాలు నివేదన చేస్తారు. ఈ రోజు స్వామివారు అహంకారుడనే రాక్షసుడుని శరణాగతుడిని చేస్తాడు. ఈ తొమ్మిదోనాటి పూజ పరమార్థం అహంకారాన్ని విడిచిపెట్టడమే. గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం: మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకారాలను తొలగించి, ముక్తికి అర్హుడిగా మార్చడమేనని పురాణోక్తి.

నిమజ్జనం ఎప్పుడు? ఎలా చేయాలి? :వినాయకుడిని 3, 5, 7, 9, 11, 21 రోజుల్లో నిమజ్జనం చేయడం ఉత్తమమని పండితులు చెబుతారు. విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజులపాటు చేయాలి. మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. పత్రి, ఫలాలు నిమజ్జనం చేయొద్దు. ఫలాలను దానం చేయడం ఉత్తమం. నిమజ్జనోత్సవం నదులు, సముద్రాల్లో చేయాలి. అలా కుదరని పక్షంలో కుండలో గానీ, బిందెలో గానీ నీళ్లలో నిమజ్జనం చేసి ఆ నీటిని తులసి, మామిడి వంటి మొక్కల్లో పోయాలని సూచిస్తున్నారు.

నిమజ్జనంలో దాగిన రహస్యం ఇదే! :మట్టిలోంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి, దాన్ని శుద్ధిచేసి మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి ధూపదీపాలతో, సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతాం. అష్టోత్తర శతనామాలతో పూజించి, నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలికి ఆఖరిగా విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే కలుపుతాం. ఇదే విధంగా మనిషి కూడా తన శరీరం మట్టిలో నుంచే వచ్చిందని, తిరిగి అదే మట్టిలో కలుస్తుందని గుర్తించాలి. తన జీవన ప్రయాణంలో అరిషడ్వర్గాలను తొలగించుకొని, భక్తిమార్గాన్ని పెంచుకొని, ధర్మమార్గంలో మోక్షం వైపు అడుగులు వేయాలనే సారాంశం వినాయక వ్రతంలో స్పష్టంగా కనబడుతోందని పండితులు చెబుతున్నారు.

పత్రిలో దాగి ఉన్న పరమార్థం ఇదే! :భాద్రపదమాసం వర్షఋతువులో వస్తుంది. ఈ మాసంలో జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. ఈ జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ మాసంలో వినాయకవ్రతాన్ని 11 రోజులు లేదా 21 రోజుల పాటు చేస్తుంటారు. ఈ వ్రతం సందర్భంగా ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమతో గడపలను అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల వాతావరణం శుభ్రపడుతుందని చెబుతారు. అలాగే వినాయక పూజలో 21 రకాల పత్రాలు వాడతారు. ఈ పత్రాలు ఆయుర్వేద, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని కలిపి వినాయకుడిని పూజించడం వల్ల ఆ పత్రాల నుంచి వచ్చే వాసనకు క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఇళ్లలోకి ప్రవేశించవని, తద్వారా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

చవితి రోజున చంద్రుడుని చూస్తే ఏం చేయాలి? :వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పండితులు చెబుతారు. మరి, అనుకోకుండా చంద్రుడిని చూస్తే ఎలా? అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. నిందలు పడాల్సి వస్తుందని కంగారు పడతారు. అయితే, ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలట. అదే సమయంలో, భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండటానికి, పూర్తి భక్తి విశ్వాసంతో –

"సింహః ప్రసేన మవధీః సింహా జాంబవతా హతః

సుకుమార మారోదీః తవ హ్యేష శ్యమంతకః"

అనే మంత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. ఆ తర్వాత గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షతలను తల మీద వేసుకుంటే, చవితినాడు చంద్రుడిని చూసిన దోషం తొలగిపోతుందట.

వినాయకుడి ముఖ్యమైన రూపాలు ఇవే! :విఘ్నేశ్వరుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయనీ, వీటిలో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు.

1. బాలగణపతి:వినాయకుడి బాల్య రూపమే బాలగణపతి. పిల్లలను కాపాడటం, చిన్నారులకు తెలివి, ఆరోగ్యం, సంతోషం ప్రదానం చేస్తాడు.

2. తరుణగణపతి: తరుణగణపతి అంటే యువకుడి రూపంలో ఉన్న గణపతి. ఆయనను కళాత్మకత, సృజనాత్మకత, యౌవనశక్తికి ప్రతీకగా భావిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేయాలనే కోరికను తరుణగణపతి ప్రేరేపిస్తారు.

3. భక్తగణపతి: ఈ రూపాన్ని వినయం, భక్తి, నిష్ఠకు ప్రతీకగా భావిస్తారు. ఈ రూపంలో గణపతిని పూజించడం వల్ల వినయం, భక్తి, సేవాభావం కలుగుతాయి.

4. వీరగణపతి : వీరగణపతి అంటే వీరుడుగా ఉన్న గణపతి. శక్తి, ధైర్యం, పరాక్రమానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల శక్తి, పరాక్రమం, ధైర్యం, రక్షణ లభిస్తాయి.

5. శక్తిగణపతి : శక్తిగణపతి అంటే అపారమైన శక్తిని కలిగిన గణపతి. ఆయనను శక్తి, బలం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల అపార శక్తి, విజయం, అంతరాలు తొలగడం, ఆరోగ్యం వంటిలి కలుగుతాయి.

6. ద్విజగణపతి : ద్విజగణపతి అంటే రెండు రూపాలను కలిగి ఉన్న గణపతి. ఈ రూపంలో, గణపతి ఒక వైపు మానవుడి రూపంలో, మరొక వైపు ఏనుగు ముఖంతో కనిపిస్తారు. ఈ రెండు రూపాలు మానవునిలోని దైవికత, భౌతికతను సూచిస్తాయి.

7. సిద్ధిగణపతి : సిద్ధిగణపతి అంటే సిద్ధిని ప్రసాదించే గణపతి. ఆయనను సిద్ధి, బుద్ధి మరియు శ్రీ (ధనం) లకు అధిపతిగా భావిస్తారు.

8. ఉచ్చిష్టగణపతి : ఉచ్చిష్టగణపతి అంటే అన్ని రకాల అపవిత్రతను తొలగించే గణపతి. అపవిత్రతను నాశనం చేసి, పవిత్రతను ప్రసాదించే దైవంగా ఈ రూపాన్ని కొలుస్తారు.

9. విష్ణుగణపతి : విష్ణుగణపతి అంటే విష్ణుమూర్తితో అనుబంధం ఉన్న గణపతి. విష్ణుగణపతిని విష్ణువు అవతారంగా లేదా భక్తుడిగా భావిస్తారు.

10. క్షిప్తగణపతి : క్షిప్తగణపతి అనేది గణపతి దేవుని అనేక రూపాలలో ఒకటి. ఈ రూపంలో గణపతిని తన అంతరాత్మను గుర్తించడానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు సహాయం చేసే దైవంగా భావిస్తారు.

11. హేరంబగణపతి : ఈ రూపంలో గణపతికి ఐదు తలలు ఉంటాయి. ప్రతి తలకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ ఐదు తలలు మన మనస్సులోని ఐదు భావాలను సూచిస్తాయి. అవి జ్ఞానం, అహంకారం, మోహం, క్రోధం, మమత. ఈ ఐదు భావాలను జయించి మనస్సును శాంతంగా ఉంచడానికి హేరంబ గణపతిని ప్రార్థిస్తారు.

12. లక్ష్మీగణపతి : ఈ రూపంలో గణపతి దేవుడు లక్ష్మీ దేవితో కలిసి ఉంటారు. లక్ష్మీ దేవి సంపద, అష్టైశ్వర్యాలకు అధిదేవత. అందుకే లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల సంపద, సమృద్ధి, అభివృద్ధి లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

13. మహాగణపతి : 'మహా' అంటే గొప్ప, అతిశయమైన అని అర్థం. అంటే, గణపతి ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు అని అర్థం. ఈ రూపాన్ని విఘ్న నివారణకు, జ్ఞానం, బుద్ధికి అధిపతిగా భావిస్తారు.

14. విజయగణపతి : విజయగణపతి అనేది గణపతి దేవుని ఒక ప్రత్యేక రూపం. ఈ రూపంలో గణపతిని విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఏ పని చేసినా విజయం సాధించాలంటే విజయగణపతిని ఆరాధించాలని పండితులు సూచిస్తారు.

15. ఋత్యగణపతి :ఇది వినాయకుడి మరో అద్భుతమైన రూపం. 'ఋతు' అంటే కాలం అని అర్థం. అంటే, కాలానికి అధిపతి అయిన గణపతిని ఋత్యగణపతి అంటారు.

16. ఊర్ధ్వగణపతి : ఇది గణపతి దేవుని మరో అద్భుతమైన రూపం. 'ఊర్ధ్వ' అంటే పైన, పైకి అని అర్థం. ఆకాశానికి అధిపతి అయిన గణపతిని ఊర్ధ్వగణపతి అంటారు. ఈ రూపాన్ని పూజిస్తే అంచలంచెలుగా ఎదుగుతారు.

ఇవీ చదవండి:

వినాయక చవితి పూజ టైమింగ్స్ ఇవే​ - ఈ రంగు వస్త్రాలు ధరించాలి - చంద్రుడిని ఆ సమయంలో చూడొద్దు!

బొజ్జ గణపయ్యకు "ఉండ్రాళ్ల పాయసం" - ఇలా చేసి పెడితే వినాయకుడు ఎంతో ఆనందిస్తాడు!

ABOUT THE AUTHOR

...view details