Vastu Tips for House Construction :మనిషికి.. తిండి, బట్ట తర్వాత మరో అతి ముఖ్యమైన అవసరం గూడు. తిన్నా తినకున్నా.. ఇల్లు మాత్రం కావాల్సిందే అంటారు పెద్దలు. జీవితంలో ఇల్లుకు ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది మరి! జీవితం మనశ్శాంతిగా సాగిపోవాలంటే సొంత ఇల్లు అనివార్యం అంటారు. అందుకే.. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు చాలా మంది.
అయితే.. పలు కారణాలతో కొంత మంది అప్పటికే నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే.. వాస్తు ప్రకారం ఇలా నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని కొనడం మంచిదేనా? కాదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి.. నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని కొనడం పట్ల వాస్తు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఆడంబరం ముఖ్యం కాదు..
ఇల్లు ఎంత ఆడంబరంగా కట్టుకున్నామన్నది ముఖ్యం కాదు.. అది వాస్తు ప్రకారం ఉన్నదా లేదా? అన్నదే ముఖ్యమని అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ రోజుల్లో.. ఆర్కిటెక్ట్ మాయలో పడిపోయి.. డిజైన్లకు ముచ్చటపడిపోతున్నారని, దీంతో వాస్తును మరిచిపోతున్నారని అంటున్నారు. ఇల్లు నిర్మాణ శైలి ఎలా ఉన్నా.. వాస్తు దాటి కట్టుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులు చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కొనుగోలు చేయొచ్చా?
ఈ రోజుల్లో చాలా మంది.. బిల్డర్లు కట్టిన ఇళ్లనే కొనుగోలు చేస్తున్నారు. అయితే.. అప్పుల కారణంగానో, మరేదో అవసరం రీత్యానో కొందరు నిర్మాణం మధ్యలో ఉన్న ఇళ్లను అమ్మేస్తుంటారు. ఒక పైసాకు తక్కువగా వస్తుందనే కారణంతో ఇలాంటి ఇళ్లను వేరే వాళ్లు కొనుగోలు చేస్తుంటారు. మరి.. వాస్తు ప్రకారం ఇలా నిర్మాణం మధ్యలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడం మంచిదేనా అంటే.. కొనుగోలు చేయొచ్చనే చెబుతున్నారు వాస్తు నిపుణులు. అయితే.. కొన్ని పనులు తప్పక చేయాలని సూచిస్తున్నారు.
ఇవి చెక్ చేసుకోండి..
నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే.. అడుగు ముందుకు వేయాలని సూచిస్తున్నారు. ఇంటి ప్లాన్ చూసి ముందస్తుంగా అడ్వాన్స్ ఇవ్వడం వంటివి చేయొద్దని సలహా ఇస్తున్నారు. అదేవిధంగా.. ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా పూర్తవుతుందో తెలుసుకోవాలని చెబుతున్నారు. ఇంటి మెయిన్ డోర్, కిటికీలు, బాల్కనీ.. అన్నీ వాస్తు ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ ఏదైనా తేడాగా ఉంటే.. నిర్మాణం మధ్యలోనే ఉంది కాబట్టి.. మార్పులు, చేర్పులు చేసుకోవడానికి వీలుగా ఉందా లేదా అన్నది కూడా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా మార్పులు అవసరమైతే వెంటనే చేసేయాలని చెబుతున్నారు.
ఈ విధంగా.. నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. వాస్తుతోపాటుగా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయోమో తప్పకుండా సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు మొదలు.. భూమి వివాదం వంటివి ఏమైనా ఉన్నాయా? అని క్లియర్గా చెక్ చేసుకోవాలని, లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని చూస్తున్నారు. ఇవన్నీ సజావుగా ఉంటే.. నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని సైతం కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నారు.