Vastu For Main Gate Of House :వాస్తును చాలా మందే నమ్ముతారు. ఇళ్లు కట్టేముందు సిద్ధాంతిని పిలిపించుకుని వారి సూచనల మేరకు నిర్మాణం చేపడతారు. అందులో వాస్తు కూడా ఒకటి. మరి పూర్తి ఇంట్లో కాకుండా ప్రహరీ గోడ, గేట్ల విషయంలో కూడా వాస్తు పాటించే వాళ్లున్నారు. మరి వాటికి సంబంధించిన నియమాలు, విధి విధానాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఇల్లంతా చక్కగా కట్టుకుని ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నారు. వాటికి గేట్లు పెట్టే విషయంలో కొంత మంది తెలిసీ తెలియక తప్పులు చేస్తారు. గేట్ల డెకరేషన్ విషయంలో శుభం, క్షేమం అనే వాటికి గుర్తుగా 'ఐ' గుర్తు ఉన్న గేట్లు, ఐశ్వర్యదాయకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రహరీ గేట్ల ఉచ్ఛ నీచ స్థానాల్ని గుర్తించాలి. ఉచ్ఛ అంటే మంచి, నీచ అంటే చెడు స్థానం అని అర్థం. గేట్లు సహజ సిద్ధంగా రోడ్డు ఏ వైపు ఉంటుందో ఆ వైపే పెడతాం. అయితే స్థలానికి ఎన్ని పక్కల రోడ్లు ఉంటే అన్ని పక్కలా ఉండాలని లేదు.
ఉత్తర దిశలో ఇళ్లు నిర్మించే వారు గేట్ల విషయంలో గుర్తు పెట్టుకోవాల్సిన పెద్ద నియమం ఏంటంటే, ఈశాన్యంలో పెద్ద గేటు ఉంచి, సింహద్వారంలో చిన్న గేటు పెట్టుకోవాలి. వాయువ్యంలో గేటు పెట్టకూడదు. ఇలా పెడితే అనర్థదాయమైన ప్రభావం ఉంటుంది. రోడ్లు తూర్పునకు, ఉత్తరం వైపునకు ఉన్నప్పుడు రెండు గేట్లు పెట్టడం మంచిది.
ఉత్తర, పడమర రోడ్లు ఉన్నప్పుడు, ఉత్తర దిక్కునే గేట్లు పెట్టుకోవాలి. తూర్పు, ఈశాన్యం గేటు వల్ల పుత్ర సంతతి అభివృద్ధి చెందడానికి, పుత్ర సంతానం కలగడానికి అవకాశముంటుంది. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ ఉన్నతి, ఆయుష్షు కూడా పెరుగుతుంది. అదే తూర్పు, ఆగ్నేయ గేటు వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. గృహానికి ఉత్తర, ఈశాన్య సింహద్వారం మంచిది కలిగిస్తుందంటుంది శాస్త్రం. దీని వల్ల ధనయోగం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.