తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే 'వాల్మీకి జయంతి' ప్రత్యేకతలు ఇవే!

నారదుని తారక మంత్రోపదేశంతో - వాల్మీకిగా మారిన రత్నాకరుడు!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Valmiki
Valmiki (Getty Images)

Valmiki Jayanti 2024 :ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి భరతభూమి. ఈ తరం వారు అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తిని పొంది, వారి మార్గంలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతారు. అలాంటి ఓ మహనీయుని జీవిత గాథను ఈ కథనంలో తెలుసుకుందాం.

వాల్మీకి జయంతి
హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శ కావ్యం రామాయణం. అలాంటి రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షి జీవిత విశేషాలు తెలుసుకుందాం.

వాల్మీకి జనన విశేషాలు
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని నగర ఖండంలోని ముఖార తీర్థ సృష్టికి సంబంధించిన విభాగంలో వాల్మీకి ఓ బ్రాహ్మణుడిగా జన్మించాడని తెలుస్తోంది. మరో కథనం ప్రకారం వాల్మీకి అసలు పేరు రత్నాకరుడని, ఆయన బోయవాడని వేటాడి జీవించేవాడని తెలుస్తోంది. ఏది ఏమైనా వాల్మీకి జీవితం లోకానికే ఆదర్శం.

కరువు కాటకాలతో దొంగగా మారిన వాల్మీకి
ఒకానొక సమయంలో 12 సంవత్సరాల పాటు వర్షాలు కురియక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో రత్నాకరుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి అడవి మార్గంలో ప్రయాణించే వారిని అటకాయించి దారికాచి దోచుకునేవాడు. ఒకసారి నారద మహర్షి అదే మార్గంలో ప్రయాణిస్తూ రత్నాకరుడికి తారసపడ్డాడు. అప్పుడు నారదుడు అతనిని సంస్కరించదలచి, నీవు చేసే ఈ పాపంలో నీ భార్యాబిడ్డలు పాలు పంచుకుంటారా? అని అడుగుతాడు. వెంటనే బోయవాడు ఇంటికి వెళ్లి తాను చేసే పాపంలో పాలు పంచుకుంటారా? అని అడుగుతాడు. అప్పుడు అతని భార్యా పిల్లలు మమ్మల్ని పోషించే భారం నీదే కాబట్టి నీవు ఎలా సంపాదించావో మాకు అనవసరం. నీ పాపంలో మాకు భాగం లేదని స్పష్టం చేస్తారు. వారి మాటలు వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన బోయవాడు అడవికి వెళ్లి నారదునికి ఇదే విషయం చెబుతాడు.

తారక మంత్రోపదేశం
అప్పుడు నారదుడు రత్నాకరునికి నీ పాపం పోయే ఉపాయం చెబుతాను విను అంటూ రామ నామాన్ని జపిస్తూ తపస్సు చేసుకోమంటాడు. బోయవానికి 'రామ' నామం పలకడానికి నోరు తిరగక 'మరా' 'మరా' అనడం మొదలు పెడతాడు. వేగంగా 'మరా మరా' అని పలికితే అదే రామ నామ తారక మంత్రంగా మారింది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. బోయవాడు ప్రాపంచిక స్పృహ లేకుండా అలాగే తపస్సులో మునిగిపోయాడు. కొంత కాలానికి అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టేశాయి. పూర్తిగా పుట్టలో మునిగిపోయిన రత్నాకరుని వెతుక్కుంటూ అతని బంధువులు వచ్చేసరికి పుట్ట మధ్యలో కనిపించాడు.

వాల్మీకిగా మారిన రత్నాకరుడు
పుట్టను సంస్కృతంలో వల్మీకం అంటారు. వల్మీకం నుంచి బయటపడ్డ రత్నాకరుడు ఆనాటి నుంచి వాల్మీకి మహర్షిగా మారాడు. అక్షర జ్ఞానం లేని రత్నాకరుడు సంస్కృతంలో రామాయణం అనే మహాకావ్యాన్ని రచించాడు.

వాల్మీకి జయంతి ఎప్పుడు
అక్టోబర్ 17వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు శ్రీరామ నామ జపం చేయడం, రామాయణ పారాయణ చేయడం ద్వారా శ్రీ వాల్మీకి మహర్షి అనుగ్రహంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చునని పెద్దలు, పండితులు చెబుతున్నారు. వాల్మీకి జయంతి రోజు ఆ మహానుభావుని జీవిత విశేషాలు తెలుసుకొని, ఒక ఆదర్శ గురువుగా ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆ మహర్షికి మన ఇచ్చే నిజమైన గురు దక్షిణ.

జై శ్రీరామ్!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details