Heroines Completed MBBS : సమాజంలో వైద్యుల పాత్ర చాలా కీలకం. అందుకే డాక్టర్లను కులమతాలకతీకంగా అందరూ గౌరవిస్తారు. అయితే భారత చిత్ర సీమకు చెందిన చాలా మంది నటీమణులు మోడలింగ్‌తోపాటు ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశారు. మరి వారెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాయి పల్లవి : తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అందాల ఆరబోతకు దూరంగా కేవలం కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ, తాను అందరి లాంటి అమ్మాయిని కాదని సాయిపల్లవి నిరూపించారు. గ్లామర్ షోకు దూరంగా ఉన్నా ఆఫర్లే ఈమెను వెతుక్కుంటూ వెళ్తాయి. అందుకే సౌత్‌లో ఆమె అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే సాయిపల్లవి జార్జియాలోని టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016లోనే తన వైద్య విద్యను పూర్తి చేశారు. అలాగే 2020లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం సాయిపల్లవి వైద్య వృత్తిలో లేరు. నటనపైనే దృష్టి పెట్టారు.
శ్రీలీల : కన్నడ ఇండస్ట్రీలో నటప్రస్థానం మొదలుపెట్టిన యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సౌత్‌లో అదరగొడుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', రవితేజ 'ధమాకా' వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకున్నారు. కాగా, శ్రీలీల తల్లి వృత్తిరీత్యా వైద్యురాలు. గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. తన తల్లి స్ఫూర్తితో శ్రీలీల కూడా 2021లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే శ్రీలీల కూడా ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు.
మానుషి చిల్లర్ : 2017 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఈమె కూడా సోనిపత్లోని భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అందాల పోటీల్లో పాల్గొనడానికి కొంత కాలం గ్యాప్ ఇచ్చి వైద్య విద్యను పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమాలో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు మానుషి.
అదితి శంకర్ : ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్. ఆమె 'విరుమాన్', 'మావీరన్' వంటి తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అదితి రామచంద్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
నటనలోనే కాదు చదువులోనూ తాము సూపర్ అని నిరూపించారు ఈ హీరోయిన్లు. చదువు కూడా జీవితంలో చాలా ముఖ్యమని నిరూపించారు. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే, పట్టుదలగా వైద్య విద్యను పూర్తి చేశారు.