US Polls 2024 Kamala Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు వారాలే మిగిలి ఉండటం వల్ల కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పలు సర్వేల్లో ఇరువురు తేడా స్పల్పంగానే ఉండటం వల్ల అభ్యర్థిలిద్దరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. లాటినో అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్లు, అరబ్ అమెరికన్లు, హిస్పానిక్ ఓట్లను గంపగుత్తుగా పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాలు ఒక్కొసారి ఒక్కో పార్టీపై మెుగ్గు చూపుతుండటమే అందుకు కారణం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవెడా, అరిజోనా, నార్త్ కరోలినాలు కీలక రాష్ట్రాలు. నార్త్ కరోలినా, అరిజోనాలో ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరిగా ఉంది. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియాలలో కమలా హారిస్ ఒక పాయింట్‌తో అధిక్యంలో ఉంది. అయితే ఎన్నికల దగ్గర పడే కొద్ది ఇది మారొచ్చు.
- హేమంత్ పటేల్, ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ఛైర్మన్
నల్లజాతీయులు, హిస్పానిక్ ఓట్లను కొల్లగొట్టేందుకు ఇద్దరు అభ్యర్థులు ప్రయత్నిస్తుడంటం వల్ల అధ్యక్ష రేసు రసవత్తరంగా మారింది. మెుదట్లో నల్లజాతీయులు డొనాల్డ్ ట్రంప్ వైపు మెుగ్గుచూపినా కమలా హారిస్ నామినేషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ మిశ్రా తెలిపారు. హిస్పానిక్ ఓటర్లు ట్రంప్ వైపు మెుగ్గుచూపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మెజారిటీ సర్వేల్లో ఇరువురి మధ్య తేడా స్వల్పంగానే ఉందని చెప్పారు.
ఇటీవల నిర్వహించిన సర్వేల్లో సాంప్రదాయ ఓటర్లు ప్రత్యర్థి వైపు మెుగ్గుచూపుతున్నారనే విషయాన్ని సూచిస్తున్నాయి. కొంత మంది లాటినో అమెరికన్లతో పాటు నల్లజాతీయులు ట్రంప్‌నకు మద్దతు తెలుపుతున్నారు. అయితే నల్లజాతీయుల ఓటర్లలో ఇప్పటికీ కమలా హారిస్‌దే పైచేయి! వలసలు, సరిహద్దు వద్ద నియంత్రణ, ఆర్థికాభివృద్ధి, ఆబార్షన్ హక్కులు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.
-- డాక్టర్ వివేక్ మిశ్రా, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్
ఇరు పార్టీల అభ్యర్థుల ప్రచారాలను పరిశిలిస్తే, వారు ప్రాధాన్య అంశంగా వలసలను ఎంచుకున్నారు. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మించాలని గత ఎన్నికల్లో ట్రంప్ ప్రతిపాదించారు. జో బైడెన్, కమలా హారిస్ హయాంలో అనేక మంది వలసదారులు చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించారని ట్రంప్ చెబుతున్నారు. అందులో కొంత మంది నిజం కూడా ఉంది. స్ప్రింగ్‌ఫీల్డ్, ఒహియో లాంటి చోట్ల హైతీకి చెందిన పౌరులు అక్రమంగా ఉంటున్నారు. సరిహద్దు గస్తీలో కఠినంగా వ్యవహరించామని డెమోక్రాట్లు ఎదురుదాడి చేస్తున్నారు. రెండో ప్రాధాన్య అంశంగా అబార్షన్ హక్కును ప్రస్తావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికాకు మెుట్టమెుదటి మహిళా అధ్యక్షురాలు కావాలని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఉవ్విళ్లూరుతున్నారు. అటు అధ్యక్ష పగ్గాలను మరోసారి చేపట్టాలని డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు.