Tirumala Srivari Brahmotsavam Simha Vahanam :తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
దుష్టశిక్షణ - శిష్టరక్షణ
జగన్నాయకుడి దశావతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్ట జన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహా ధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసమే శ్రీనివాసుడు సింహ వాహనాన్ని అధిరోహించారు.