తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

తిరుమల 'రామకృష్ణ తీర్థం'- మాఘ పౌర్ణమి రోజు స్నానమాచరిస్తే మోక్షం ప్రాప్తి! - RAMAKRISHNA THEERTHAM

తిరుమల క్షేత్రంలోని పవిత్ర 'రామకృష్ణ తీర్థం'- ఒక్కసారి స్నానమాచరిస్తే చాలు - సకల పాపాలు తొలిగిపోతాయ్!

Ramakrishna Theertham
Ramakrishna Theertham (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2025, 4:56 PM IST

Ramakrishna Theertham :తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు, మరెన్నో పవిత్ర ప్రదేశాలు. తిరుమలలోని పవిత్ర తీర్థాలకు ఏటా ముక్కోటి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగనున్న సందర్భంగా ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఎప్పుడు?
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఒకటి. ఏటా మాఘ మాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి విశిష్టతను తెలుసుకుందాం.

తిరుమలలో పుణ్య తీర్థాలు
పురాణాల ప్ర‌కారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్య తీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమపావనులై ముక్తి పొందుతార‌ని న‌మ్మ‌కం.

శ్రీరామకృష్ణ తీర్థం ఎక్కడ ఉంది
శ్రీరామకృష్ణ తీర్థం తిరుమ‌ల శ్రీ‌వారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

పౌరాణిక గాథ
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్ర‌కారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తన తపస్సు కోసం, ప్రతినిత్యం పవిత్ర స్నానం చేయడం కోసం రామకృష్ణ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఆ మహర్షి ఈ తీర్థ తీరంలో నివ‌సిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారంట! ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణువు సాక్షాత్కారంతో ఆయన ముక్తి పొందినట్లుగా స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఇలా జరుగుతుంది
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి పర్వదినం రోజు ఉద‌యం 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ‌తారు. అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

రామకృషతీర్థ స్నానఫలం
ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించ‌డం వ‌ల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వ‌ల్ల క‌లిగే దోషాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ ఉత్సవం జరిగేది మాఘ పౌర్ణమి రోజు కాబట్టి మాఘ స్నాన ఫలంతో మోక్షాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తిరుమల 'పాండవ తీర్థం'- ఒక్కసారి స్నానం చేస్తే చాలు- అన్నింటా విజయం తథ్యం!

తిరుమలలో ఉన్న జాపాలి తీర్థం గురించి తెలుసా? ఒక్కసారి ఆ అంజన్నను దర్శిస్తే చాలు!

ABOUT THE AUTHOR

...view details