Tiruchanur Pavitrotsavam : వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఏడాదిలో అమ్మవారి ఆలయంలో భక్తుల వల్ల, లేకుంటే సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా నివారించేందుకు చేస్తారు. సంవత్సరంలో మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇందులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు ఎప్పుడంటే?
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీన అంకురార్పణతో ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 16న పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే అంతకు ముందుగానే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కూడా జరుగుతుంది.
సెప్టెంబరు 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలు పురస్కరించుకొని సెప్టెంబర్ 10వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?
అమ్మవారి ఆలయంలో పవిత్రతకు తెలిసీ తెలియక ఏదైనా భంగం కలిగుంటే శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.