Lucky Plants for Home As Per Vastu :మొక్కలు పెంచడమంటే చాలా మందికి ఇష్టం. ఖాళీ ప్లేస్ దొరికితే చాలు మొక్కలతో నింపేస్తారు. ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ ట్రెండ్ కూడా నడుస్తోంది. దీంతో రకరకాల మొక్కలను ఇష్టంగా నాటుతున్నారు. ఇంటి బయట సరే.. మరి ఇంట్లో పెంచే మొక్కల గురించి తెలుసా? అవే లక్కీ ప్లాంట్స్. ఈ మొక్కలు చాలా అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు ప్రకారం ఈ మొక్కల ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉండటంతో పాటు కొన్ని దుష్ట శక్తులు దరిచేరవని, అలాగే డబ్బు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ మొక్కలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
వెదురు : వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అంటారు. ఇది నిజమైన వెదురు మొక్క కాకున్నా దాని లాగా పొడవుగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో మట్టి అవసరం లేకుండా నీళ్లలోనే పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనం, సౌభాగ్యం, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది.
స్నేక్ ప్లాంట్ : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్ను పెంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. దీనినే మదర్ ఇన్ లా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఈ మొక్కలు పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతేకాదు ఇది గాలిలో ఉండే విషపూరిత వాయువుల్ని పీల్చుకుని గాలిని శుభ్రంగా మారుస్తుంది.
కుబేర మొక్క :దీనినే జేడ్ ప్లాంట్, క్రాసులా మొక్క అని అంటారు. చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఈ మొక్కను నాటమని సలహా ఇస్తున్నారు. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివిటీని పెంచుతుందని.. తద్వారా శ్రేయస్సు, సంపద పొందవచ్చంటున్నారు.