Skanda Shasti Significance :స్కంద షష్ఠి వ్రతం ప్రతినెలా హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజున వేకువజామునే లేచి భక్తులు ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. అసలు స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏమిటి? కార్తిక మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్కంద షష్ఠి విశిష్టత
స్కంద షష్ఠి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పర్వదినం. ఈ స్కంద షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. దీన్ని ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు. అసలేంటీ స్కంద షష్ఠి? ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? కార్తిక మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది? స్కంద షష్ఠి పూజా విధానమేమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
ప్రతి మాసంలో స్కంద షష్ఠి
ప్రతి నెలా శుక్ల పక్షంలోని శుద్ధ షష్ఠి రోజున స్కంద షష్ఠి జరుపుకుంటారు. కార్తిక మాసంలో స్కంద షష్ఠి నవంబర్ 7వ తేదీ(గురువారం)న వచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభసమయం.
స్కంద షష్ఠి వెనుక పౌరాణిక గాథ
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి వరాలను పొంది అపారమైన శక్తిని కూడగట్టుకొని భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు శివుని ఆజ్ఞ ప్రకారం దేవ గణాలతో కలిసి 6 రోజుల పాటు యుద్ధం చేసి అతనిని ఓడిస్తాడు. సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించిన రోజు శుక్లపక్ష షష్ఠి తిథి కావడంతో ఆ నాటి నుంచి ప్రతి మాసం శుక్లపక్ష షష్ఠి రోజు కార్తికేయ విజయాన్ని పురస్కరించుకొని స్కంద షష్ఠి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.