తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ గాథ తెలుసా? ఈ పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటి? - ugadi festival importance - UGADI FESTIVAL IMPORTANCE

Significance Of Ugadi Festival : తెలుగువారి పండుగ ఉగాదికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా? పంచాంగ శ్రవణం విశిష్టతకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు మీకోసం.

Significance Of Ugadi Festival In Telugu
Significance Of Ugadi Festival In Telugu

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 1:00 AM IST

Significance Of Ugadi Festival :ఉగాది అంటే యుగానికి ఆది అని అర్ధం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. సోమవారంతో శ్రీ శోభకృత్​ నామ సంవత్సరం ముగుస్తుంది. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

What Is The Importance Of Ugadi :
ఉగాది వెనుక ఉన్న పురాణ గాథ!
శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మ దేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం 'ఉగాది' పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణప్రతీతి.

సృష్టికి ఆది ఉగాది!
అలాగే చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మసృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతారు.

ఉగాది- ప్రకృతి పండుగ!
వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారతాయి. వసంతం రాగానే కొత్త చిగుళ్లు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి. అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది.

ఉగాది పండుగ శోభ!
ఉగాది పండుగ రోజు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. మామిడి తోరణాలు, పూల మాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి.

షడ్రుచుల ఉగాది పచ్చడిలో అంతరార్థం
Significance Of Ugadi Pachadi :ugadi festival importanceఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చి మిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే! ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి.

ఉగాది పచ్చడిలోని శాస్త్రీయత
మన పండుగలు, ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి.

వసంతానికి శోభనిచ్చే కోకిల గానం
మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది.

సకల పాపహరణం పంచాంగ శ్రవణం
Panchanga Sravanam :ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం(Ugadi Panchangam 2024) కన్నుల పండువగా జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆకట్టుకునే కవి సమ్మేళనం
మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది. ఈరోజున కవులను, పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండువగా, వీనులవిందుగా జరుగుతాయి.

శ్రీనివాసుని సన్నిధిలో కొలువు
తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

పండుగలు, సంప్రదాయాలు మర్చిపోవద్దు
పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు. మనం మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది. తద్వారా మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్లమౌతాము. చివరగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తు - పూజ గదిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! - లేకపోతే కష్టాలు తప్పవు! - vastu tips for home

సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే జాబ్​ గ్యారంటీ- కష్టాలన్నీ పరార్! - somvati amavasya 2024 importance

ABOUT THE AUTHOR

...view details