తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శబరిమలలో అయ్యప్పకు అభిషేకం - 13 ఏళ్ల కన్నె స్వామికి దక్కిన అదృష్టం! - MAKARA JYOTHI 2025

-మకర విళక్కు మహోత్సవానికి శబరిమల ముస్తాబు -ఈ రోజు సాయంత్రం మకరజ్యోతి దర్శనం

Sabarimala Neyyabhishekam 2025
Sabarimala Neyyabhishekam 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 1:53 PM IST

Sabarimala Neyyabhishekam 2025 :హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం లక్షలాది మంది అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. స్వామియే శరణం అయ్యప్ప- నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఏటా మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామికి అత్యంత భక్తిశ్రద్ధలతో నెయ్యితో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారికి చేసే అభిషేకం నెయ్యిని కవడియార్ ప్యాలెస్ నుంచి సన్నిధానానికి కన్నె స్వామి తీసుకెళ్లడం ఇక్కడి ఆచారం. అయితే, ఈ సంవత్సరం ఆ అదృష్టం 13 ఏళ్ల కన్నె స్వామి ఆదిత్యకు దక్కింది. ఆదిత్య వెంట గురుస్వామి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. వీరు ఒకరోజు ముందుగానే అభిషేకం నెయ్యితో సన్నిధానానికి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం నెయ్యితో అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేశారు. శబరిమల సన్నిధానంలో వేలాది మంది భక్తుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సన్నిధానానికి అభిషేకం నెయ్యిని తీసుకెళ్లిన ఆదిత్య 8వ తరగతి చదువుతున్నాడు. స్వామి వారికి అభిషేకం నెయ్యి తన చేతుల మీదుగా సన్నిధానానికి తీసుకెళ్లడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని సంతోషం వ్యక్తం చేశాడు. "ఇది అయ్యప్ప స్వామి ఆశీర్వాదంగా భావిస్తాను. ఈ రోజు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితం ధన్యమైంది" అని ఆదిత్య ఆనందం వ్యక్తం చేశాడు.

మకర జ్యోతి విశిష్టత :

మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరమూ జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిపుంజం! ఇది కేరళలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు.

జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం :

సాక్షాత్తూ ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమలలో మకర సంక్రాంతి నాడు 'మకర జ్యోతి'ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. సంక్రాంతి నాడు సాయంత్రం సమయంలో కనిపించే మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు.

స్వామియే శరణమయ్యప్ప!

మకరజ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తి భావంతో అయ్యప్ప భక్తులు "స్వామియే శరణమయ్యప్ప!" అంటూ చేసే శరణఘోషలతో శబరిగిరులు మారుమోగుతాయి. ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే, తప్ప మాటల్లో చెప్పలేమని అంటారు అక్కడికి వెళ్లిన భక్తులు. ప్రత్యక్షంగా మాలధారులు మకర జ్యోతిని దర్శించుకుంటే, పరోక్షంగా కొన్ని లక్షల మంది ప్రజలు టీవీలు, మొబైల్​ ఫోన్లలో మకరజ్యోతిని దర్శించుకుంటారు.

మకరజ్యోతి స్పెషల్- ఏపీలోనే ఫస్ట్ అయ్యప్ప గుడి విశేషాలు మీకోసం!

మదిని పులకింపజేసే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం- ఆధ్యాత్మిక జ్ఞాన దీపాన్ని చూస్తే అంతా శుభం!

ABOUT THE AUTHOR

...view details