Rameswaram Temple History :ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన 'రామేశ్వరం' తమిళనాడులో ఉంది. హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం సంగమస్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమ శివుడు రామనాథస్వామిగా భక్తులకు దర్శమిస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రతోపాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రామేశ్వరం చరిత్ర :
పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు - సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేదతీరారని పురాణోక్తి.
అప్పుడు.. మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా ఉండటానికి.. పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు.. కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట రాముడు.
అయితే.. బయల్దేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గరపడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారుచేసిందట. ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు.. ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించాడట. అంతేకాదు.. భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలనే కోరాడట.
మీ ఇష్ట దైవానికి ఈ పూలు సమర్పించొద్దట! - మీకు తెలుసా? - Never Offer These Flowers to Gods
అందుకే.. ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలూ, నైవేద్యాలూ చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా రెండు శివలింగాలూ కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు.