తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్ధం- ఏటా శివకేశవ అభేదంగా ఉత్సవాలు- మీరెప్పుడైనా వెళ్లారా?

శ్రీరాముడు నడయాడిన ప్రదేశంగా భావించే రామతీర్ధం ఆలయం- శివ కేశవ అభేదంగా ఉత్సవాలు

Ramatheertham Temple
Ramatheertham Temple (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 12:27 PM IST

Ramatheertham Temple History In Telugu : భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు. అబ్బురపరిచే మన ఆలయాలను దర్శించడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు విచ్చేస్తుంటారు. కర్మ భూమిగా పేరొందిన భారతదేశంలో సాక్షాత్తూ భగవంతుడు స్వయంభువుగా వెలసిన ఎన్నో ఆలయాలు కలవు. శివ కేశవ అభేదంగా ఉత్సవాలు జరిగే రామ తీర్ధం క్షేత్ర విశేషాలు అబ్బురపరుస్తాయి. సాక్షాత్తూ శ్రీరాముడు నడయాడిన ప్రదేశంగా భావించే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటో, ఆలయ విశేషాలేమిటో చూద్దాం.

రామతీర్థం ఎక్కడ ఉంది?
ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్ధం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. పురాణాల ప్రకారం వనవాసం సమయంలో శ్రీరాముడు ఇక్కడ సంచరించాడని, ఆ సమయంలో శివుని మంత్రాన్ని జపించారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

స్థల పురాణం
ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో పాండవులు కృష్ణుని తమతో కూడా రమ్మని పిలిస్తే శ్రీకృష్ణుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఇచ్చి తనకు బదులుగా వాటిని పూజించమని చెప్పాడంట! ఈ ప్రాంతంలో ఉండే భీముని గృహం ఇందుకు ఆధారంగా నిలుస్తోంది. 16 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు శ్రీరాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ బోడి కొండపైన నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడంట. వెంటనే రాజు ఆ విగ్రహాలను వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించాడంట! తీర్ధంలో దొరికిన విగ్రహాలు కాబట్టి ఈ క్షేత్రానికి రామతీర్ధమని పేరు వచ్చింది. చరిత్ర పుటలను పరిశీలిస్తే ఈ ఆలయం అతి ప్రాచీనమైనది, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందినదని తెలుస్తోంది. 1880 ప్రాంతంలో కార్మైకెల్ అనే ఆంగ్లేయ దొర రాసిన విశాఖపట్నం చరిత్రలో రామ తీర్ధం ఆలయం గురించిన ప్రస్తావన ఉండడం విశేషం.

చారిత్రక ఆధారాలు
రామ తీర్ధం ఆలయ పరిసర ప్రాంతాల్లో బౌద్ధులు, జైనులు నివసించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి కొండల్లో ఉన్న గురుభక్త కొండ, దుర్గకొండలపై ఉన్న ప్రాచీన బౌద్ధాలయాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కొండలకు ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉన్నాయి.

ఆలయ విశేషాలు - ఉపాలయాలు
రామ తీర్ధం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, మాధవ స్వామి, వైకుంఠ నాథస్వామి, వేణు గోపాలుడు, లక్ష్మీదేవి, ఆంజనేయస్వామి, ఆళ్వారుల సన్నిధి, ఉమాసహిత సదాశివ స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.

శ్రీరామ పాదముద్రికలు
సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం సంచరించారనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి ఉత్తరాన ఉన్న ఏకశిలా పర్వతంపై శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు కానవస్తాయి. అలాగే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దొరికిన మడుగుకు పశ్చిమాన భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి. విశేషమేమిటంటే రామాలయం పక్కనే ఉన్న కోనేరులో నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవంటారు.

ఉత్సవాలు వేడుకలు - శివ కేశవ అభేదం
రామ తీర్ధం ఆలయంలో శివకేశవ అభేదంగా ఉత్సవాలు జరగడం ప్రత్యేకత. ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తుల రద్దీతో ఉండే రామ తీర్ధంలో ఇటు శివునికి, కేశవునికి కూడా పూజలు జరుగుతాయి.

  • దసరా సమయంలో ఇక్కడ 10 రోజులపాటు వేంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
  • విజయదశమి రోజు స్వామి అశ్వ వాహనంపై నీలాచలం వద్దకు చేరుకొని జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండుగలా సాగుతుంది.
  • ఏడాదికోసారి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు జరిగే జ్యేష్టాభిషేకం రోజు శ్రీరాముని నిజరూప దర్శనం ఉంటుంది.
  • ఇక కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రామ కోనేరులో సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరుగుతుంది.
  • రామతీర్ధాన్ని శైవక్షేత్రంగా కూడా భావించి శైవులు మహాశివరాత్రి పర్వదినానికి విశేషంగా తరలి వస్తారు. ఆ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల రామ తీర్ధం భక్త జనసంద్రంగా మారుతుంది.

ఇక ఉత్తరాంధ్రలో అతి పెద్ద జాతర పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు రామ తీర్ధాన్ని కూడా దర్శించడం పరిపాటి. పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు వెళ్లే భక్తులు తప్పకుండా రామ తీర్ధం క్షేత్రాన్ని కూడా దర్శించే ప్రయత్నం చేయండి. ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్! ఓం నమః శివాయ!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details