Rakhi Festival Significance : వ్యాస భగవానుడు రచించిన విష్ణు పురాణం ప్రకారం రాఖీ పౌర్ణమిని 'బలేవా' అని కూడా పిలుస్తారు. ఇందుకు ఓ కారణముంది. బలి చక్రవర్తి మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి తన అపారమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడంట! విష్ణుమూర్తి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఇందుకు ఏమి చేయాలా అని అలోచించి శ్రీమహాలక్ష్మి రాఖీ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టిందంట! లక్ష్మీదేవి రాఖీ కట్టగానే బహుమతిగా ఏమి కావాలో కోరుకోమన్నాడంట బలి చక్రవర్తి. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనతో వైకుంఠానికి పంపించామని అడగగానే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీ దేవితో వైకుంఠానికి పంపించాడంట! అలా అప్పటి నుంచి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని ఒక కథనం.
ద్రౌపది సోదర ప్రేమ
మహాభారతం ప్రకారం ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ద్రౌపదికి తనను రక్షించే వారు తన సోదరుడు శ్రీకృష్ణుడు మాత్రమే అని తలచి కృష్ణుని ప్రార్ధించి అవమానభారం నుంచి తప్పించుకుంది. అన్నాచెల్లెళ్ల బంధానికి గుర్తుగా ద్రౌపది శ్రీ కృష్ణునికి రాఖీ కట్టిందని కూడా అంటారు.
విష్ణుమూర్తికి రాఖీ కట్టిన శచీదేవి
మరో కథనం ప్రకారం, స్వర్గాధిపతి ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకోగా శచీదేవి శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి శరణు వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణు దేవుడు ఆ రాక్షసి నాశనం చేస్తాడు. అప్పటినుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందని అంటారు.
రాఖీ పండుగ ఎప్పుడు?
ఆగస్టు 19, సోమవారం రోజు రాఖీ పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 నిమిషాల లోపు రాఖీ కట్టడానికి సుముహూర్తం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
రాఖీ అంటే ఏమిటి?
రాఖీ అంటే 'రక్షణ' అని అర్ధం. తమ సోదరులకు ఎలాంటి ఆపదలు, అవాంతరాలు లేకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఆడపడుచు తన అన్నదమ్ములకు కట్టే 'రక్ష'ను రాఖీ అంటారు. తమ శ్రేయస్సును, అభ్యున్నతిని కోరుకునే అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములు కానుకలిచ్చి సంతోష పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.