తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పెరటాసి మాసంలో వెంకన్నకు పిండి దీపంతో పూజ- సకల శుభాలు చేకూరడం పక్కా! - Purattasi Masam 2024 - PURATTASI MASAM 2024

Purattasi Masam 2024 Venkateswara Swamy : తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 17 వరకు కొనసాగే పెరటాసి మాసం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధనకు శ్రేష్టమైన మాసం. పెరటాసి మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి పూజలు చేయాలి? అనే అంశాలు ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.

Lord Venkateswara Swamy
Lord Venkateswara Swamy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 5:28 AM IST

Purattasi Masam 2024 Venkateswara Swamy : పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరం అంటారు. మాసాల పేర్లు తమిళంలో, తెలుగులో వేరువేరుగా ఉంటాయి. తెలుగు మాసాలు చంద్రమానం ప్రకారం ఉంటే, తమిళ మాసాలు సౌరమానం ప్రకారం లెక్కగడతారు. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు పేరు ఉంటుంది. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆరో నెలను పెరటాసి అని వ్యవహరిస్తారు. దీనినే పురటాసి, పెరుమాళ్ అని కూడా అంటారు.

పెరటాసి ఎందుకంత ప్రత్యేకం?
శ్రీమహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసమని వేంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. ద్రవిడ సంప్రదాయం ప్రకారం 'తిరు' అంటే 'శ్రీ' అని అర్ధం. తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అంటారు. అలాగా శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే స్వామి ఏడుకొండలపై వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇదే విషయం శ్రీ వ్యాస మహర్షులు రచించిన శ్రీ స్కంద పురాణంలో ఉన్న వైష్ణవ ఖండము లోని 'శ్రీ వేంకటాచల మాహాత్మ్యం' లో స్పష్టం చేసిఉంది.

పెరటాసి మాసంలో వెంకన్నను ఇలా పూజిస్తే సకల శుభాలు
పెరటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకం. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి ప్రీతికరమైనవే! ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనది. ద్రవిడ సంప్రదాయాన్ని పాటించే వారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు. అన్ని శనివారాలు చేయలేనివారు మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసునికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు.

పిండి దీపం ఎలా వెలిగించాలి?
శ్రీనివాసునికి భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు గంటల ముందుగా పావుశేరు బియ్యాన్ని నీటిలో మూడు గంటలపాటు నానబెట్టి ఉంచుకోవాలి. తరువాత నీళ్లన్నీ వడగట్టి బియ్యాన్ని నీడన ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యాన్నిరోటిలో కానీ మరలో కానీ మెత్తని పిండిలా పట్టించి ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం అంతా కూడా మడిగానే చేయాలి.

పిండి దీపం సమర్పణ
ఒక అరిటాకులో మెత్తని పిండి, కొద్దిగా బెల్లం, ఆవునెయ్యి కలిపి మధ్యలో గుంటగా చేసుకొని అందులో అఖండ ఒత్తి వేసి ఆవునేతితో దీపారాధన చేయాలి. పిండి దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అనంతరం స్వామికి ఇష్టమైన చక్ర పొంగలి, మిరియాల కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. మనసులోని కోరికను స్వామి సమక్షంలో చెప్పుకొని, కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. గోవింద నామాలు చదువుకోవాలి. పిండి దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అన్ని శనివారాలు చేయలేక పోయినా మూడో శనివారం తప్పకుండా చేయాలి. ఇలా శ్రీనివాసునికి పెరటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం.

శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా వెంకటాచలంపై అవతరించిన శుభసందర్భంగా ఈ మాసంలో ఏడుకొండలవానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల వైభవం కళ్లారా చూడాల్సిందే! ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు జరిగే గరుడ సేవ తిలకించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి తరలి వస్తారంట!

పెరటాసి వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు

  • పెరటాసి మాసంలో శనివారాలు పిండి దీపం చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
  • ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం పఠించాలి.
  • 30 రోజులపాటు నుదుటన తిరు నామం ధరించాలి.
  • నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
  • ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం తప్పనిసరి. మద్యమాంసాలు ముట్టరాదు.
  • ప్రతిరోజూ వేంకటేశ్వరుని ఆలయం సందర్శించాలి.

శ్రీనివాసునికి ప్రతిరోజూ పూజ తర్వాత చక్ర పొంగలి కానీ, కట్టు పొంగల్ కానీ నివేదించాలి.పరమ పవిత్రమైన పెరటాసి మాసంలో శ్రీనివాసుని భక్తిశ్రద్ధలతో పూజిద్దాం. ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలకు పాత్రులవుదాం. ఓం నమో వేంకటేశాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details