Pujas To Do On Saturday :వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతేకాదు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజని కూడా అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. శనిగ్రహ ప్రభావం వలన కలిగే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనివారం రోజున కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిది. శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. తర్వాత నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన శని అనుగ్రహానికి పొందవచ్చు.
- శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయి.
- హిందూ పురాణాల ప్రకారం శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు. ఈ రోజున ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే హనుమంతునికి శనివారం వడమాల సమర్పిచండి. తద్వారా శని బాధలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆంజనేయుడికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా దూరం అయిపోతాయి.
- శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం అయిదు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.
- శనివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని గురువులు చెబుతారు.
- శనివారం రోజు ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతారు.