Puja Procedure Tips At Home : హైందవ సంప్రదాయం ప్రకారం పూజలో పాటించాల్సిన మొదటి నియమం గణపతి పూజ. ఇంట్లో చేసే నిత్య పూజలో ముందుగా గణపతి ప్రార్థన శ్లోకం చదువుకున్న తర్వాత మిగిలిన దేవీ దేవతలకు పూజ చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా గణపతిని దర్శించిన తర్వాతనే మిగిలిన దేవుళ్ళ దర్శనాలు చేసుకోవాలి. తెలిసో తెలియకో చాలామంది ఈ చిన్న తప్పులను చేసి, పూజకు ఫలితం రాలేదని చింతిస్తుంటారు.
ఈశాన్యమే ప్రధానం
మన ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం పరమేశ్వరుని స్థానం. ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే. అందుకు దేవుని పూజకు ఈశాన్యం శ్రేష్టం. ఈశాన్యంలో ఉన్న పూజామందిరంలో భగవంతునిపై ధ్యానం చక్కగా కుదురుతుంది. చేసిన పూజకు ఫలితం కూడా త్వరగా వస్తుంది.
ఈ దిశగా పూజ చేస్తే శుభ ఫలితాలు
ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పూజ చేసేవారు తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేయాలి. దేవీ దేవతల విగ్రహాలు కానీ, పటాలు కానీ పడమటి దిశగా ఉండాలి. కొంతమంది దేవుని పటాలను తూర్పు దిశగా ఉంచుతారు కానీ ఇది సరైనది కాదు. పూజ చేసే వారు తూర్పు దిశగా తిరిగి పూజ చేయడం సర్వత్రా శ్రేష్టం. ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ దిశ వైపు ఉంచి పూజ చేసే వారు ఉత్తరం వైపు తిరిగి పూజ చేసుకోవచ్చు. శుభ ఫలితాలు పొందాలనుకునే వారు ఈ నియమాలు పాటించడం తప్పనిసరి.
ఇలాంటి దుస్తులు ధరించి పూజ చేస్తే ప్రతికూల ఫలితాలు గ్యారంటీ
మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజా సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం. పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక్క శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతోంది.
దీపారాధనకు ఈ నియమం తప్పనిసరి
పూజలో సగం వెలిగి ఆరిపోయిన వత్తిని తిరిగి వెలిగించకూడదు. తిరిగి దీపారాధన ప్రమిద కానీ, కుందులు కానీ శుభ్రపరచి తరవాతనే దీపం వెలిగించాలి.