Pasupu Remedy to Avoid Financial Problems:చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదని.. అప్పులు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. ఈ సమస్యలు తొలగిపోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు, పరిహారాలు చేసినా ఫలితం లేదని ఆవేదన చెందుతుంటారు. అయితే.. అలాంటి వారు దేవీ నవరాత్రుల్లో పసుపు పరిహారం చేస్తే జన్మజన్మల దరిద్రం పోయి.. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పసుపు అమ్మవారికి ఎంతో ప్రితీపాత్రమైనది. నవరాత్రుల్లో పసుపుకు సంబంధించిన అద్భుతమైన పరిహారం పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోతాయని.. ధన కనక వస్తు వాహన ప్రాప్తి లభిస్తుందని మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు. ఆ పరిహారం ఏంటంటే..
- ముందుగా మీకు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్లాలి. అక్కడ అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపులో కొంత భాగాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.
- అలా తెచ్చుకున్న పసుపును ఇంట్లో ఉన్న పసుపుతో కలపాలి. ఆ తర్వాత ఆ మొత్తం పసుపును వెండి భరిణెలో ఉంచి.. ఆ భరిణెను పూజా మందిరంలో ఉంచాలి.
- ఇలా ఉంచిన తర్వాత నవరాత్రుల నుంచి ప్రతిరోజూ పూజ చేసుకునేటప్పుడు ఆ భరిణె వద్ద పువ్వులు ఉంచి ధూపం సమర్పించి హారతి అందించాలి. ఇలా చేస్తే అతి త్వరలోనే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో కూడా చెప్పినట్లు ఆయన వివరిస్తున్నారు.
- కథ చూస్తే.. సుధాముడు అనే బ్రాహ్మణుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు.. సుధాముడి భార్యకు ఓ మహర్షి ఈ పసుపు పరిహారం చెప్పాడు. సుధాముడి భార్య అమ్మవారి ఆలయంలో పూజకు ఉపయోగించిన పసుపును తెచ్చి వెండి భరిణెలో పెట్టి ధూపాలు వెలిగించి నమస్కరించుకోవడం వల్ల వాళ్లకున్నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగినట్లు దేవీ భాగవతంలో ఉందని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు.
కుజ దోషం తొలగిపోవాలంటే: కుజ దోషం వల్ల పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నా, భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటున్నా, ఇతర సమస్యలు ఏవైనా.. అవి తొలగిపోవాలంటే నవరాత్రుల్లో పసుపు పరిహారం పాటించాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ పరిహారం ఏంటంటే..
- ముందుగా మీకు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్లాలి. అక్కడ అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపులో కొంత భాగాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.
- ఆ పసుపును తమలపాకులో పెట్టి ముద్దలాగా చేసుకోవాలి. ఆ పసుపు ముద్దను మంగళగౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ "ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః" అంటూ 21 సార్లు జపించాలి.
- ఆ తర్వాత ఆ పసుపు ముద్దకు హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రటి కుజ దోషమైన తొలగిపోతుందని వివరిస్తున్నారు.
- ప్రతిరోజూ ఇంట్లోని అమ్మవారి ఫొటోకు పసుపు, కుంకుమలతో పూజ చేస్తూ గౌరీ దేవికి సంబంధించిన అష్టోత్తర నామాలు చదువుకున్నా కుజ దోషం తీవ్రత తగ్గుతుందని అంటున్నారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి, కుజ దోషాన్ని నివారించడానికి నవరాత్రుల్లో పసుపు పరిహారం చేయడం మంచిదని అంటున్నారు.