తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్యసిద్ధి, శత్రు జయాన్నిచ్చే పద్మనాభ ద్వాదశి- ఎలా చేయాలో తెలుసా? - PADMANABHA DWADASHI

పద్మనాభ ద్వాదశి అంటే ఏంటి? ఎలా పూజ చేసుకోవాలి? వ్రతఫలం ఏంటి?

Padmanabha Dwadashi
Padmanabha Dwadashi (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 3:48 PM IST

Padmanabha Dwadashi Puja Vidhi In Telugu :జీవితంలో ప్రతి ఒక్కరు చేసే పనిలో విజయాన్ని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి గ్రహాల అనుకూలత లేక తరచూ చేసే పనిలో ఆటంకాలు, విఘ్నాలు కలుగుతుంటాయి. ఒక్కోసారి చేపట్టిన పనులు పూర్తి కావేమో అన్న అనుమానం నిరాశ కలిగిస్తుంది. కానీ హైందవ సంప్రదాయం చాలా విశిష్టమైనది. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. దైవారాధనతో పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా కొన్ని విశేష దినాలలో చేసే పూజల వలన ఆశ్చర్యపోయే ఫలితాలు ఉంటాయి. అలాంటి ఒక పూజ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ద్వాదశి విశిష్టత
తెలుగు పంచాంగం ప్రకారం ద్వాదశి తిథి చాలా విశిష్టమైనది. ఒక సంవత్సరంలో 12 ద్వాదశులు వస్తాయి. ప్రతి ద్వాదశి విశిష్టమైనదే! ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటాం. అయితే పద్మనాభ ద్వాదశి రోజు ఏ దేవుని పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?

పద్మనాభ ద్వాదశి అంటే ఏంటి?
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు. వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో కూడా పద్మనాభ ద్వాదశి వ్రతం గురించిన ప్రస్తావన ఉంది. పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయని పురాణ వచనం. పూర్వం పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రుజయం పొందారని రుషి వాక్కు.

పద్మనాభ ద్వాదశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం అక్టోబర్ 14 వ తేదీ, సోమవారం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజునే పద్మనాభ ద్వాదశి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు, 9 గంటల నుంచి 10:30 గంటల వరకు పూజకు సుముహూర్తం.

పద్మనాభ ద్వాదశి పూజా విధానం
పద్మనాభ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామిని విశేషంగా పూజిస్తారు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీస్నానం ఆచరిస్తే పుణ్యం. వీలుకాని వారు గంగాదేవిని స్నానం చేసే నీటిలో ఆవాహన చేసి స్నానం చేయవచ్చు. అనంతరం పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం లక్ష్మీ నారాయణులను సహస్రనామాలతో అర్చించాలి. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి.

సాయంత్రం పూజ
సాయంత్రం యధావిధిగా పూజ పూర్తి చేసుకుని సమీపంలో విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. భాగవత కథలు, పురాణాలు చదువుకోవాలి. పద్మనాభ ద్వాదశి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్ర దానం చేస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.

ఈ నియమాలు పాటించాలి
పద్మనాభ ద్వాదశికి కఠిన నియమాలేమి ఉండవు. పూజ పూర్తయ్యేవరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. అసత్యం ఆడరాదు.

పద్మనాభ ద్వాదశి వ్రత ఫలం
భక్తిశ్రద్ధలతో పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయి. రానున్న పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని మనం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిద్దాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details