Padmanabha Dwadashi 2024 Vrat Katha : ఏ వ్రతమైన నోము అయినా పూజ పూర్తయ్యాక ఆ వ్రత కథను చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అయినట్లుగా భావిస్తారు. అప్పుడే వ్రత ఫలం కూడా దక్కుతుందని శాస్త్రవచనం. పద్మనాభ ద్వాదశి వ్రత కథను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
పద్మనాభ ద్వాదశి విశిష్టత
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి రోజును పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి రచించిన వరాహపురాణం పద్మనాభ ద్వాదశి ముందు రోజు పాశాంకుశ ఏకాదశి వ్రతం ఆచరించిన వారు పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని కూడా తప్పకుండా ఆచరించాలి. అప్పుడే ఏకాదశి వ్రత ఫలం కూడా దక్కుతుందని ఋషి వాక్కు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరించిన వారు వ్రత కథను కూడా తప్పకుండా చదువుకోవాలి.
పద్మనాభ ద్వాదశి వ్రత కథ
వేదవ్యాసుడు రచించిన మహాభారతం ప్రకారం ధర్మరాజు శకునితో జరిగిన మాయాజూదంలో ఓటమి పాలై 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అరణ్య వాసంలో పాండవులు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది.
పస్తులున్న పాండవులు
వేదవ్యాసుడు రచించిన మహాభారతం అరణ్య పర్వంలో వివరించిన ప్రకారం అరణ్యవాసం సమయంలో పాండవులు అనేక కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో వారు తినడానికి తిండి కూడా లేక పస్తులున్నారు. ఆ సమయంలో పాండవులు ద్రౌపది సమేతంగా శ్రీకృషుని ప్రార్ధించి తమ కష్టాలు పోయే మార్గం చెప్పమని కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి రోజు వచ్చే పద్మనాభ ద్వాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును నియమ నిష్టలతో పూజిస్తే కష్టాలు తొలికిపోతాయని, కార్యసిద్ధి శత్రుజయం కలుగుతాయని చెప్పాడంట.
పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరించిన పాండవులు
శ్రీకృష్ణుని సూచన మేరకు పాండవులు శాస్త్రోక్తంగా పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు కౌరవులపై విజయం సాధించి తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. ఆనాటి నుంచి కార్యసిద్ధి, శత్రుజయం కోరుకునేవారు పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని మనమందరం కూడా భక్తిశ్రద్ధలతో ఆచరిద్దాం ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.