తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సిరులు కురిపించే 'మార్గశిర లక్ష్మీవార వ్రతం' - అమ్మవారిని ఇలా పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి!

మార్గశిర లక్ష్మీవార వ్రతం - విశిష్టత, నైవేద్యాలు, పూజా విధానం మీకోసం

lord lakshmi devi
lord lakshmi devi (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Margashirsha Guruvar 2024 : పూజలు, వ్రతాలు హిందూ సంప్రదాయంలో భాగం. ముఖ్యంగా శ్రావణ మాసం మొదలుకొని మాఘ మాసం వరకు ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే 'మార్గశిర లక్ష్మీవార వ్రతం' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గురువారం లక్ష్మీ వ్రతంతో అపార ఐశ్వర్యం
సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

'మాసానాం మార్గశీర్షోహం'
మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగములో చెప్పినట్లుగా తెలుస్తోంది. మార్గశిర మాసం మహా విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం.

మార్గశిర గురువారం విశిష్టత
మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి, దీపాలను వెలిగించి, లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్య్ర బాధలు, అలక్ష్మీ ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబమునుందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థము.

మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం
మార్గశిర లక్ష్మీ వారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంటి గుమ్మం నందు, తులసి కోట వద్ద పూజ మందిరము నందు ఆవు నేతితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రమును పరచి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. లక్ష్మీదేవిని కుంచం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చేయాలి. అనంతరం పసుపు నీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంగళ హారతులు ఇవ్వాలి.

4 వారాలు - 4 నైవేద్యాలు
మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి.

  • మొదటి గురువారం : బియ్యం, పెసర పప్పు, నెయ్యి కలిపి వండిన పులగం మొదటి గురువారం లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.
  • రెండో గురువారం : మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.
  • మూడో గురువారం : బెల్లం బియ్యం పిండితో చేసిన అప్పాలు, పరమాన్నం లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.
  • నాలుగో గురువారం : చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.
  • ఐదో గురువారం : ఒకవేళ ఐదు గురువారాలు వస్తే ఐదవ గురువారం రోజు పూర్ణం బూరెలు లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.

మార్గశిర లక్ష్మీవార వ్రత ఫలం
ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వ సుఖాలు పొంది, అంత్యమున మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. రానున్న మార్గశిర మాసంలో మనం కూడా మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిద్దాం. లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details