Narmada Pushkaralu 2024 : హిందూ సంప్రదాయాలలో నదులను దేవతలుగా పూజిస్తారు. మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సంవత్సరం మే 1 నుంచినర్మదా నదికిపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తారు. అయితే, నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరగనున్నాయి ? ఏ ఏ ప్రదేశాల్లో పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మోక్షం లభిస్తుందని నమ్మకం :పుష్కరకాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే, పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని.. ఈ సమయంలో పవిత్ర నది స్నానమాచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి, మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..
అమర్‌కంఠక్ :నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఆవిర్భవించి.. పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేలాది మైళ్లు ప్రవహించి.. పారిశ్రామిక నగరమైన సూరత్‌ను అక్కున చేర్చుకొని, అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్‌కంఠక్‌ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. అమర్‌కంఠక్‌లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
జబల్‌పుర్ :నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్. ఇక్కడికి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జబల్‌పుర్‌లో పవిత్ర నదీ స్నానం చేసిన తర్వాత హనుమంతల్ బడా జైన్‌మందిర్, మదన్ మహల్, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు..
హోషంగాబాద్ :నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్‌లో నదీ స్నానం చేయడానికి, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.