Narada Jayanti 2024 :సకలశాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు అయిన నారదుడు వైశాఖ బహుళ విదియ రోజు అవతరించారు. పురాణాల ప్రకారం నారదుడు బ్రహ్మ మానస పుత్రుడని తెలుస్తోంది. శుక్రవారం ఆయన జయంతి. ఈ సందర్భంగా నారదుడి గురించి తెలుసుకుందాం.
కలహభోజనుడు
నారద మహర్షికి కలహ భోజనుడని కూడా పేరు ఉంది. నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చేరవేస్తూ ఉండేవాడు. నారదుని కారణంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మధ్య కొన్నిసార్లు కలహాలు కూడా జరిగేవి.
లోకకల్యాణ కారకుడు
కలహ భోజనుడు అని నారదుని పిలిచినప్పటికీ నారదుడు సృష్టించే కలహాలన్నీ లోకకల్యాణానికి కారణమయ్యేవి. నారదుడు పెట్టిన కలహం కారణంగానే శ్రీమహాలక్ష్మి వైకుంఠం వీడి కొల్హాపురికి చేరుకుంటుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహా విష్ణువు భూమిపైకి వచ్చి కలియుగం ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యి కోనేటి రాయుడయ్యాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందుకే నారదుడు త్రిలోకంలో పూజనీయుడయ్యాడు.
నారద మహర్షి రచనలు
నారదుడు నారాయణ భక్తుడే కాదు, గొప్ప పండితుడు కూడా! ఆయన రచించిన నారద పురాణం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంధం. నారదుడు రచించిన 84 సూత్రాలుతో కూడిన నారదభక్తి సూత్రాలు ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. ఇందులో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలను పొందుపరిచారు.
నారద జయంతి రోజు నారదుని ఎలా పూజించాలి?
- నారద జయంతిని విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు విష్ణు భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రమైన నదీ స్నానం చేసి శుచియై నారద మహర్షి గౌరవార్థం ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.
- కొంతమంది ఇంట్లో నారద మహర్షి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తారు. కొంతమంది నారదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని పూజిస్తారు.
- నారద మహర్షి పూజను స్వచ్ఛమైన హృదయంతో పవిత్రమైన మనస్సుతో చేయాలని చెబుతారు.
- నారద మహర్షి పూజా సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి తులసి, మందార పూలతో పూజించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. సాయంత్రం తిరిగి దేవతార్చన చేసి ఉపవాసాన్ని విరమించాలి.