Horoscope In Tula Sankramanam :సూర్యుడు ప్రతినెలా ఒక్కో రాశిలోనికి ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా సూర్యుడు తులారాశిలో సంచరించే నెల రోజుల సమయంలో 12 రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారికి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ నెల రోజుల పాటు మేషరాశి వారు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు కలుగవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో భాగస్వామితో వ్యవహరించేటప్పుడు సహనంతో, ప్రశాంతంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వృధా ఖర్చులు చేసే ముందు ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుంటే మంచిది. వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సానుకూల ఫలితాల కోసం సూర్య ఆరాధన ఆవశ్యకం.
పరిహారం : ఈ మాసంలో ప్రతి ఆదివారం కుంకుమ కలిపిన నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం.
వృషభం
వృషభ రాశి వారికి సూర్యుని తులా సంక్రమణం ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రత్యర్థుల ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. దేశ, విదేశాలతో వృత్తి వ్యాపారాలు సాగించే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గత కొంత కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మొత్తం మీద తులా సంక్రమణం వృషభరాశి వారికి కలిసివస్తుంది.
పరిహారం :ఈ మాసమంతా నిత్య గాయత్రీ మంత్ర జపం శక్తినిస్తుంది.
మిథునరాశి
మిథునరాశి వారికి తులా సంక్రమణంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు. ఏకాగ్రత, పట్టుదలతో చదివి పరీక్షలలో విజయం సాధిస్తారు. గృహాలంకరణ కోసం, నూతన వాహనం కొనుగోలు నిమిత్తం ధనవ్యయం ఉండవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
పరిహారం :ఈ మాసమంతా ప్రతినిత్యం ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడం వలన వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు సంభవించవచ్చు. మీ తల్లి వైద్య అవసరాలకు కోసం అధిక ధన వ్యయం ఉండవచ్చు. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఊహించని ధనలాభాలను అందుకోవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
పరిహారం : ఈ మాసమంతా ప్రతి నిత్యం సూర్యాష్టకం పఠించడం శుభప్రదం.
సింహ రాశి
సింహరాశి వారికి తులాసంక్రమణం మంచి యోగాన్నిస్తుంది. అదృష్టవంతులవుతారు. అదృష్టం వరించి చేపట్టిన ప్రతి పని లాభదాయకంగా ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యునికి సింహరాశి స్వస్థానం కావడంతో ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా ఎదగడానికి కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు పొందుతారు. సన్నిహితులతో విహారయాత్రకు వెళ్తారు. ఉద్యోగులు ధైర్య సాహసాలతో మెరుగైన పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారంలో పురోగతి, ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
పరిహారం : ఈ మాసమంతా ప్రతినిత్యం 108 సార్లు గాయత్రీ మంత్రం జరిపించడం శ్రేయస్కరం.
కన్య రాశి
కన్యారాశి వారికి సూర్యుని తులాసంక్రమణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మాసంలో ఈ రాశివారికి అన్నింటా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు కానీ, తీర్థయాత్రలకు వెళ్లడానికి అనువైన సమయం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సూర్యుని తులా సంచారం ఈ రాశి వారికి సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తోంది.