Mahashivratri In Srisailam Temple : భువిలో వెలసిన కైలాసం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి క్షేత్రంగా పేరొందింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీశైలం విశిష్టత
శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే గంగా నదిలో రెండు వేల సార్లు మునిగిన పుణ్యం, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం.
శ్రీశైలం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు 180 కి.మీల దూరంలో నల్లమల అడవుల్లో పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.
ఆలయ స్థలపురాణం
పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు ఒక పథకం ప్రకారం తమ గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి నా రాకలో వింత ఏమి లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
మల్లిఖార్జునుడనే నామధేయం ఇలా వచ్చింది!
కృష్ణానది తీరంలో మల్లికాపుర మహారాజగు చంద్రకేతుడు సంతానం కోసం పరితపిస్తుండగా, ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు చంద్రకేతుని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు జైత్రయాత్రను మొదలుపెట్టి రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి మల్లికాపురానికి చేరుకున్నాడు.
కుమార్తెను కామించిన చంద్రకేతుడు
రాజ్యానికి తిరిగి వచ్చిన చంద్రకేతు తన అంతఃపురంలో తిరుగుతున్న అందమైన కన్యను చూసి మోహించాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి 'నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి' అని వేడుకున్నా, చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు.
శివుని ప్రార్థించిన చంద్రమతి
దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరోదారిలేక తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని మల్లెపూలతో పూజించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. అనంతరం శివుడు మల్లికాపురమును నిర్మూలిస్తాడు. అప్పటి నుంచి శివునికి మల్లిఖార్జునుడనే నామధేయం ఏర్పడిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ విశేషాలు
శ్రీమల్లికార్జునుని దేవాలయంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా పూజలందుకుంటున్నాడు. నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము శ్రీశైలం.
శక్తిపీఠం కూడా
శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ వెలసిన అమ్మవారు భ్రమరాంబికా దేవి. ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝుమ్మనే భ్రమరనాదం వినిపించడం ఇక్కడి ప్రత్యేకత.
సాక్ష్యమిచ్చే సాక్షి గణపతి
శ్రీశైలానికి 3 కి.మీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. ఇక్కడ గణపతిని దర్శిస్తే స్వామి శివునికి ఫలానా భక్తుడు శ్రీశైలానికి వచ్చాడని సాక్ష్యం చేబుతాడట! లేకుంటే మనం శ్రీశైలం వెళ్లిన దర్శన ఫలం దక్కదని విశ్వాసం.