Mahalaya Amavasya 2024:భాద్రపద మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని మహాలయ పక్షం లేదా పితృ పక్షం అంటారు. ఇందులో వచ్చే అమావాస్యను పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అయితే, మరణించిన పెద్దలకు ఈరోజు కొన్ని రకాల విధులు పాటిస్తే వారి అనుగ్రహం పొంది తరతరాలకు అదృష్టం కలిసివస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. ఇవే కాకుండా జాతకంలో ఉన్న పితృ దోషాలు తొలగిపోతాయని వివరించారు. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య ఉన్న నేపథ్యంలో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలు దక్షిణ దిశలో ఉంచి వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించి.. వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యంగా పెట్టాలి. ఫొటోలకు పూల మాలలు పెట్టి అలకరించాలి. వారికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని.. తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే పెద్దలు సంతోషించి వారి అనుగ్రహం కలుగుతుందట. మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు.
మరణించిన పెద్దలను స్మరించుకుంటూ తర్పణం ఇస్తే మంచిదని కిరణ్ కుమార్ అంటున్నారు. ఇంటి యజమాని దక్షిణం వైపు వెళ్లి తర్పణం వదలాలని చెబుతున్నారు. కింద చిన్న పల్లెం పెట్టి ఉద్దరిణి సాయంతో నీటిని తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహః, ఓం నారాయణయా స్వాహః, ఓం మాధవయా స్వాః అంటూ ఆచమణం చేయాలి. ఆ తర్వాత గ్లాసు నీటిలో నల్ల నువ్వులు కలిపి వాటిని కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి వదులుతూ పల్లెంలో పడేలా తర్పణం ఇవ్వాలి. ఈ నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోయాలి. ఇలా విడిచే సమయంలో మరణించిన పూర్వీకుల పేర్లను స్మరించుకోవాలి. ఇలా తర్పణం ఇవ్వడం, ఫొటోల దగ్గర నైవేద్యాలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
దీంతో పాటుగా మరణించిన పెద్దల పేరిట బ్రహ్మణులకు స్వయం పాకం (రెండు పూటల తినడానికి అవసరమైన పదార్థాలు అన్నీ) దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. ఇంకా గోసేవలో భాగంగా ఆవులు తినడానికి పచ్చి గడ్డి, తవుడుకు అవసరమైన ధనాన్ని మరణించిన వారి పేరిట దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. పెద్దల అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం వల్ల కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం, నిమ్మకాయ పులిహోర పెట్టినా మంచి జరుగుతుందన్నారు.