Mahalaya Amavasya Rituals : కమలాకర భట్ట కృత మూలం ఆధారంగా భాగవతుల సుబ్రహ్మణ్యం రచించిన నిర్ణయ సింధువు, ధర్మసింధూ, నిర్ణయ దీపికా గ్రంథములలో వివరించిన ప్రకారం, మహాలయ అమావాస్య రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృ దోషాల నుంచి విముక్తి పొందొచ్చని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. అందుకే పితృదేవతల అనుగ్రహం కోసం మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహాలయం అంటే
తెలుగు పంచాంగం ప్రకారం, ఒక సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. సాధారణంగా అన్ని అమావాస్యలు పితృదేవతలను పూజించాడనికి శ్రేష్ఠమైనవే! కానీ భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. ఏడాది మొత్తం ఏమి చేసినా చేయకపోయినా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాలయ అమావాస్య రోజు మాత్రం పితృ దేవతల అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించి తీరాల్సిందే!
మహాలయ అమావాస్య ఎప్పుడు?
అక్టోబర్ 2వ తేదీ బుధవారం భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా పితృ తర్పణాలు వదిలేందుకు మధ్యాహ్నం 12 గంటల సమయం సరైనది కాబట్టి ఈ సమయంలోనే పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టాల్సి ఉంటుంది. అందుకే మహాలయ అమావాస్య రోజు పితృదేవతల అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
తీర్చుకోవాల్సిన రుణాలు
గరుడ పురాణం ప్రకారం, ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు రుణాలు తప్పకుండా తీర్చుకోవాలి. అవి దేవఋణం, ఋషి ఋణం, పితృఋణం. పితృ ఋణం తీర్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా నిర్వహించడం, అమావాస్య తర్పణాలు విడవడం, పితృదేవతల పేరిట దానాలు చేయడం వంటి సత్కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకోవచ్చు. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు చేసే శ్రాద్ధ, తర్పణాలు వలన పితృ దేవతలకు సద్గతులు కలుగుతాయని శాస్త్ర వచనం.
మహాలయ అమావాస్య పరిహారాలు
- మహాలయ అమావాస్య రోజున నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. తీవ్రమైన పితృ దోషాలు ఉన్న వారు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం చేయడం ద్వారా దోషాలను తొలగించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
- మహాలయ అమావాస్య రోజు సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే పితృదోషం కారణంగా ఏర్పడే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
- పితృదోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు 108 సార్లు గాయత్రీ మంత్రం జపించాలి.
ఈ దానాలు శ్రేష్ఠం
పితృదేవతలకు సద్గతులు కల్గించి, సుఖశాంతులు, వంశాభివృద్ధి పొందాలంటే మహాలయ అమావాస్య రోజు కొన్ని దానాలు చేయడం శ్రేష్ఠం. అవేంటో చూద్దాం.
- మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి, వస్త్ర దానం చేయాలి. శక్తి ఉన్నవారు స్వర్ణ దానం, గోదానం, భూదానం కూడా చేయవచ్చు.
- మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణునికి కూష్మాండం అంటే గుమ్మడికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
- మహాలయ అమావాస్య రోజు ఉప్పు, పత్తి, ఇనుము, కొత్త బట్టలు, బియ్యం వంటివి దానం చేస్తే పితృ దోషాలు తొలగిపోయి సకల శుభాలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
- జాతకం ప్రకారం రాహు, కేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఒక్క మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
ఈ నియమాలు తప్పనిసరి
మహాలయ అమావాస్య రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అవేంటో చూద్దాం.
- మహాలయ అమావాస్య రోజున పితృ దేవతలకు సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా ఇంట్లోనే తయారు చేయాలి.
- ఉల్లి, వెల్లుల్లి, మద్యమాంసాలు నిషిద్ధం. బ్రహ్మచర్యం తప్పనిసరి.
- కాకికి ఆహరం అందించాలి.
- గోమాతకు ఆహరం తినిపించాలి.
- అసత్యాలు ఆడరాదు.
- ఈ నియమాలు పాటిస్తూ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే, వారి అనుగ్రహంతో పితృదోషాలు పరిహారం అవుతాయి. వంశాభివృద్ధి కలుగుతుంది.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.