How to Do Laxmi Kubera Puja at Home:పరమ పవిత్రమైన కార్తికమాసం మొదలైంది. ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ శివనామాన్ని జపిస్తుంటారు. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక ఈ కార్తిక మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే. అయితే యమ ద్వితీయ కూడా ప్రత్యేకమైనదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి అది ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యమ ద్వితీయ ఎప్పుడు:కార్తిక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే విదియ తిథిని యమ ద్వితీయ అనే పేరుతో పిలుస్తారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. 2024లో యమ ద్వితీయ నవంబర్ 3వ తేదీ ఆదివారం వచ్చిందని.. ఈ రోజున భగినీ హస్త భోజనంతో పాటు అక్షయ లక్ష్మీ కుబేర పూజ నిర్వహించాలని చెబుతున్నారు.
భగినీ హస్త భోజనం రోజు ఏం చేయాలి:భగినీ అంటే సోదరి. ఆమె తన స్వహస్తాలతో పెట్టే భోజనాన్ని భగినీ హస్త భోజనం అంటారని అంటున్నారు. ఈ రోజు ఏం చేయాలంటే..
- సోదరులందరూ తమ సోదరిమణుల ఇంటికి వెళ్లాలి.
- ఇంటికి వచ్చిన తన అన్నా లేదా తమ్ముళ్లకు సోదరి నుదిటిన తిలకం దిద్దాలి.
- ఆ తర్వాత తన వండిన వంటను సోదరులకు వడ్డించాలి.
- సోదరి చేతి వంటను తిన్నా సోదరులు ఆమెకు చీరను సారెగా పెట్టాలి.
భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ:అల్పాయుష్కుడైనామార్కండేయుడు.. యమధర్మరాజు విసిరిన యమపాశం నుంచి తప్పించుకునేందుకు పరమేశ్వరుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆ యమపాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. దీంతో ఆగ్రిహించిన శివుడు.. యమధర్మరాజుపై తన త్రిశూలాన్ని విసురుతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవటానికి పరుగెత్తి పరుగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా రాని అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందంతో యమున ఉబ్బితబ్బిబైపోతుంది. అతనికి సకల మర్యాదలు చేస్తుంది. అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో భోజనం చేసేవారిని సంహరించరాదని శివుని ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్లిపోతుంది. త్రిశూలం నుంచి రక్షణ కల్పించి, తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు ముగ్ధుడయిన యముడు.. "కార్తీక శుక్ల విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడి గృహంలో అపమృత్యు దోషాలు ఉండవు. దీర్ఘాయుష్షు కలగుతుంది" అని తన చెల్లెలు యమునకు వివరిస్తాడు.