Kumbh Mela Third Raja Snanam :భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం మహా కుంభమేళా. ఈ మేళాలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే మూడవ రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి, శాస్త్రోక్తంగా స్నానం చేసే విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మూడవ రాజ స్నానం ఎప్పుడు?
ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరగనుండగా, అతి ముఖ్యమైన మూడవ రాజ స్నానం మౌని అమావాస్య రోజు చేయనున్నారు. మౌని అమావాస్య రోజు చేసే రాజ స్నానం మహా కుంభ మేళాలో అతి పెద్ద స్నానంగా భావిస్తారు. ఈ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మౌని అమావాస్య ఎప్పుడు
జనవరి 29న పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే నదీ స్నానం, దానాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రాజ స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ శుభ సమయం సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది.
మౌని అమావాస్య విశిష్టత
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. పూర్వీకులకు మోక్షాన్ని ఇచే ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. అందునా మహా కుంభమేళాలో చేసే మూడవ రాజస్నానంగా మౌని అమావాస్య స్నానానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
అరుదైన కలయిక
హిందూ మత విశ్వాసాల ప్రకారం మౌని అమావాస్య రోజున చేసే నదీస్నానం, శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహంతో పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. వాస్తవానికి ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి. పుష్య బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందునా మహా కుంభ మేళా, మౌని అమావాస్యల కలయిక అత్యంత ఫలవంతమైనదిగా జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.