తెలంగాణ

telangana

శ్రావణ శుక్రవారం స్పెషల్​- కొల్హాపుర్ మహాలక్ష్మి టెంపుల్​ గురించి ఈ విషయాలు తెలుసా? - Kolhapur Mahalaxmi Temple

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 3:54 AM IST

Updated : Aug 9, 2024, 9:25 AM IST

Kolhapur Mahalaxmi Temple : శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సకలైశ్వర్యలతో పాటు కార్యజయం కూడా కలుగుతుందని శాస్త్ర వచనం. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు అంటూ ఎవరూ ఉండరు. అయితే మనదేశంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆలయాలు తక్కువగానే ఉన్నాయి. కొల్హాపుర్ శ్రీ మహాలక్ష్మీ ఆలయం అందులో ఒకటి. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Kolhapur Mahalaxmi Temple
Kolhapur Mahalaxmi Temple (ETV Bharat)

Kolhapur Mahalaxmi Temple: లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపుర్ ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో పంచగంగ నది ఒడ్డున ఉన్నది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదిగా భాసిల్లుతోంది. స్కాంద పురాణం, దేవీ భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు.

అవిముక్త క్షేత్రం
కొల్హాపుర్‌ను అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. అవిముక్త క్షేత్రం అంటే ఎన్నటికీ విడువలేనిది అని అర్థం. ఎలాగైతే పరమశివునికి కాశీపట్నం అవిముక్త క్షేత్రంగా ఉందో అలాగే శ్రీమహాలక్ష్మికి కొల్హాపుర్ అవిముక్త క్షేత్రంగా పేరొందింది. అంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అమ్మవారు ఎన్నటికీ వెళ్ళదు అని అర్ధం.

కరవీర మహాలక్ష్మి
కొల్హాపుర్‌లో అమ్మవారికి కరవీర మహాలక్ష్మి అని కూడా పేరుంది. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించిందని అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని అంటారు.

ఆలయ స్థల పురాణం
ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవితో సరససల్లాపాలు చేస్తున్న సమయంలో భృగు మహర్షి నారాయణుని దర్శనానికి వైకుంఠానికి వస్తాడు. లక్ష్మీ దేవితో ఏకాంతంలో ఉన్న నారాయణుడు భృగు మహర్షి రాకను గమనించాడు. అందుకు కోపం వచ్చిన భృగు మహర్షి నారాయణుని వక్షస్థలంపై తన కాలితో తన్నగా అది చూసి లక్ష్మీదేవి హతాశురాలై పోతుంది. తన నివాస స్థానమైన నారాయణుని వక్షస్థలంపై భృగు మహర్షి తన్నడం వల్ల ఆ అవమానాన్ని సహించలేని లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వీడి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిశారని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణంలో ఉంది.

శ్రీచక్ర ప్రతిష్ఠ
నడిచే దైవంగా పేరొందిన ఆది గురువు భగవత్ శ్రీ శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్థాపించినట్లుగా తెలుస్తోంది. తర్వాత విద్యాశంకర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. గురు దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. అందుకు చిహ్నంగా ఇక్కడ దత్తాత్రేయుని ఉపాలయం ఉంది.

ఆలయ విశేషాలు
సుమారు 6 వేల సంవత్సరాల క్రితంకు చెందిన ఈ ఆలయం విశాల ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది. 5 గోపురాల కింద నిర్మించిన ఈ ఆలయంలో మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహా సరస్వతి కొలువుతీరి ఉన్నారు. ఇక ఉపాలయాలలో వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవానిలను దర్శించుకోవచ్చు.

కమనీయం అమ్మవారి రూపం
గర్భాలయంలో అమ్మవారి స్వరూపం సుందరంగా ఉంటుంది. సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజాలతో, సింహ వాహినిగా అమ్మవారు దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఏడాదికి మూడు సార్లు సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై ప్రసరిస్తాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. గర్భగుడి గోడపై శ్రీ చక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకం.

ఆలయంలో పూజలు, ఉత్సవాలు
కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజూ అయిదు సార్లు అర్చనలు, హారతులు జరుగుతాయి. ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. ఇక వసంత నవ రాత్రులలో, దేవి నవరాత్రులలో కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. పిలిస్తే పలికే దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్న కొల్హాపూర్ మహాలక్ష్మిదేవిని జీవితంలో ఒక్కసారి దర్శించినా ఆ వంశంలో పది తరాల వరకు ఎవరికీ దారిద్య్ర బాధలుండవని శాస్త్ర వచనం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అక్కడ 'కావడి' ఎత్తితే సంతాన ప్రాప్తి- ఈ స్పెషల్ టెంపుల్ గురించి మీకు తెలుసా? - Subramanya Swamy Temple

కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత 'చింతామణి' గణపతి క్షేత్రం- ఎక్కడ ఉందో తెలుసా? - Chintamani Ganpati Temple

Last Updated : Aug 9, 2024, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details