తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

హోరాహోరీ సమరంలో పురంజయుని అపజయం- కార్తిక పురాణం 21వ అధ్యాయం ఇలా!

సకల పాపహరణం- కార్తిక పురాణ శ్రవణం- ఇరవై ఒకటో అధ్యాయం మీకోసం

Karthika Puranam Day 21
Karthika Puranam Day 21 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Karthika Puranam Day 21 In Telugu Pdf :కార్తిక మహా పురాణంలో 21 వ అధ్యాయంలో వశిష్టుల వారు అత్రి అగస్త్య మునుల సంవాదాన్ని జనకునితో ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదం
వశిష్ఠులవారు ఇరవై ఒకటవ రోజు కథను మొదలుపెడుతూ, అగస్త్య మహాముని, అత్రి మహామునుల యొక్క సంవాదము గురించి ఇంకను ఈ విధంగా తెలియజేసిరి. అత్రి మహాముని పురంజయుడు కథను గురించి అగస్త్యునికి ఇంకను ఈ విధముగా చెప్పసాగెను.

హోరాహోరీ సమరంలో పురంజయుని అపజయం
కాంభోజరాజులకు, పురంజయునకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇరుపక్షాలకు చెందిన చతురంగ బలములు కూడా హోరాహోరీగా పోరాటం చేయుచుండిరి. ఉభయ పక్షాలు కూడా విజయకాంక్ష తో పోరు సలుపుచుండిరి. ఆ యుద్ధభూమిలో ఎటు చూసినా శవాల గుట్టలు, తలలు తెగిన మొండెములు, విరిగిపోయిన రథములు, ఏనుగులు, గుఱ్ఱాల కళేబరాలతో హృదయవిదారకంగా ఉంది. ఆ మహా యుద్ధమున వీరత్వం జూపి మరణించిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంలో వచ్చారు. సూర్యాస్తమయము వరకు జరిగిన ఆ భయంకర యుద్ధములో కాంభోజ రాజులు మూడువంతులు సైన్యమును కోల్పోయినప్పటికీ పురంజయుని సైన్యమును అత్యంత సాహసముతో, పట్టుదలతో ఓడించారు. ఎంతో పెద్ద సైన్యమున్నప్పటికీ పురంజయునకు అపజయమే మిగిలింది.

పురంజయునికి వశిష్టుని హితోపదేశము
దానితో పురంజయుడు రహస్య మార్గము గుండా శత్రువుల కంటపడకుండా తన గృహమునకు పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు అవమానభారంతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులవారు పురంజయుని వద్దకు వచ్చి అతనిని ఊరడిస్తూ, "ఓ రాజా! ఇంతకు ముందు నేను ఒకసారి నీ వద్దకు వచ్చాను. అప్పటికే నువ్వు ధర్మభ్రష్టుడవై, జీవిస్తున్నావు. ధర్మమార్గంలో నడవమని నేను నీకెన్ని హితవులు చెప్పినా నీవు వినలేదు. నీవు భగవంతుని సేవింపక, అధర్మ మార్గంలో నడవడం చేతనే ఇప్పుడు రాజ్యభ్రష్టుడవయ్యావు. అయినా జయాపజయాలు దైవాధీనములు. ఇప్పటికైనా నా మాటను వినుము. ఇది కార్తిక మాసం. రేపు కృత్తికా నక్షత్రం తో కూడిన కార్తిక పౌర్ణమి. కావున రేపు నీవు స్నానదాన జపము వంటి నిత్య కర్మలను ఆచరించి, దేవాలయమునకు వెళ్లి దీపారాధన చేసి, భగవన్నామస్మరణ చేయుచు, నాట్యము చేయుము. ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతానం కలుగును. అంతేకాక నీవు శ్రీమన్నారాయణుని సేవించుట వలన ఆ శ్రీహరి సంతోషించి నీ శత్రువులను జయించుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును. కనుక రేపు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నీవు పోగొట్టుకున్న రాజ్యమును కూడా తిరిగి పొందుతావు. నీవు ధర్మాన్ని తప్పి,చెడు సహవాసములు చేయబట్టే కదా ఈనాడు నీకు అపజయము కలిగింది. కావున చింతించకు. ఆ శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు కార్తిక పౌర్ణమి వ్రతమును చేయుము" అని హితోపదేశము చేసెను. ఈ విధంగా అగస్త్య మహాముని , అత్రి మహామునుల సంవాదమును గురించి జనకునితో చెబుతూ వశిష్ఠులవారు ఇరవై ఒకటవ రోజు కథను ముగించాడు.

ఇతి స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే ఏకవింశాధ్యాయ సమాప్తః
ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details