Karthika Puranam Chapter 27 : పరమ పావనమైన కార్తిక మాసంలో కార్తిక పురాణ పఠనంలో భాగంగా శ్రీమన్నారాయణుడు దుర్వాసునికి ఏ విధంగా సర్ది చెప్పాడు, అంబరీషుని ద్వాదశి వ్రతం పూర్తి అయిందా? లేదా? అనే విషయాలను అత్రి అగస్త్యుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదం
వశిష్ఠులవారు జనక మహారాజుతో అత్రి మహాముని అగస్త్యుల వారి సంవాదమును తెలియచేస్తూ ఇరవై ఏడవ రోజు కథను ప్రారంభించాడు.
శ్రీమన్నారాయణుని అపార కరుణాకటాక్షాలు
అత్రి మహాముని అగస్త్య వారిని చూసి "ఓ మహానుభావా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇలా చెప్పసాగెను" అని చెప్పడం మొదలుపెట్టాడు.
శ్రీహరి దుర్వాసునితో "ఓ దుర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది అవతారాలు నాకు సంతోషకరమైనవే. నాకు అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలు వృధాగా పోకూడదు. కాబట్టే నేను అందుకు అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణులను గౌరవించుట నేను ఏకకాలంలో చేయవలసి ఉంటుంది. అది నా కర్తవ్యం.
దుర్వాసుని అంబరీషుని వద్దకు పంపిన విష్ణువు
విష్ణువు దుర్వాసునితో "ఓ మహర్షి! నీవు అంబరీషుని ఇంట భోజనం చేయకుండా ఇలా వచ్చేసినందుకు అతడు చింతాక్రాంతుడై, బ్రాహ్మణుని అవమానించానన్న బాధతో ప్రాయోపవేశము చేయదలిచాడు. అందుచేతనే నా విష్ణు చక్రం నిన్ను బాధిస్తోంది. ప్రజా రక్షణమే రాజధర్మం గానీ, ప్రజా పీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో అతనిని జ్ఞానుడైన మరొక బ్రాహ్మణుడే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప వేరే ఎవరినీ దండించకూడదు. బ్రాహ్మణులను హింసించేవాళ్ళు కూడా బ్రాహ్మణ హంతకులని శాస్త్రములు చెప్పుచున్నవి. బ్రాహణుని సిగ పట్టిలాగే వాళ్ళు, కాలితో తన్నేవాళ్ళు, బ్రాహ్మణుల ధనమును దొంగలించేవాళ్ళు, బ్రాహ్మణుని గ్రామము నుంచి తరిమే వాళ్ళు కూడా బ్రాహ్మణ హంతకులే అవుతారు. కావున ఓ దుర్వాస మహర్షీ! అంబరీషుడు తపశ్శాలియైన నీ వంటి బ్రాహ్మణుని బాధ పెట్టినందుకు పరితాపము పొందుచున్నాడు. నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్లుము. అది మీ ఇద్దరికీ క్షేమము" అని విష్ణువు దుర్వాసునికి నచ్చచెప్పి అతనిని అంబరీషుని దగ్గరకు పంపాడు. ఇక్కడి వరకు జరిగిన అత్రి అగస్త్య మహామునుల సంవాదమును చెప్పి వశిష్ఠులవారు ఇరవై ఏడవ రోజు కథను ముగించాడు.
ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! సప్తవింశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.