తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్తిక పౌర్ణమి నాడు శివారాధన- అనంత కోటి పుణ్య ఫలం- ఈ రోజుకు ఇంతటి విశిష్టత ఎలా వచ్చింది? - KARTHIKA POURNAMI SIGNIFICANCE

కార్తీక మాసం మొత్తానికీ తలమానికమైన కార్తిక పౌర్ణమి విశేషాలివే!

Karthika Pournami Pooja Vidhanam
Karthika Pournami Pooja Vidhanam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 7:01 PM IST

Karthika Pournami Pooja Vidhanam :వ్యాసుల వారు కృత యుగంతో సమానమైన యుగం కానీ, వేదంతో సమానమైన శాస్త్రం కానీ, కార్తిక మాసంతో సమానమైన మాసం కానీ, గంగా తీర్థంతో సమానమైన తీర్థం కానీ లేదని చెబుతూ మాసాలన్నింటిలోకెల్లా కార్తిక మాసానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. ఇంతటి పరమ పవిత్రమైన కార్తిక మాసంలో కార్తిక పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

అత్యంత శుభకరం కార్తిక పౌర్ణమి
శరదృతువులో వచ్చే పరమ పవిత్రమైన కార్తిక మాసంలో పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుని దర్శనం పూజలు, శివారాధన అత్యంత శుభ ఫలితాలు అతి వేగంగా వస్తాయని శాస్త్ర వచనం.

నదీస్నానం
కార్తిక పౌర్ణమి నాడు నదీస్నానం ఎంతో శ్రేష్టం. శరదృతువు లో నదీ ప్రవాహంలో ఓషధుల శక్తి ఉంటుంది. అందుకే ఈ ఋతువులో వచ్చే కార్తిక మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంది.

శివారాధన ఫలం
కార్తిక పౌర్ణమి నాడు పంచామృతాలతో శివుని అభిషేకించి జిల్లేడు పూలతో శివుని అర్చించిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

విష్ణు పూజ
కార్తిక పౌర్ణమి రోజు విష్ణువు ఆలయ దర్శనం అత్యంత శుభప్రదం. విశేషించి ఈ రోజు చేసే సత్యనారాయణ స్వామి వ్రతానికి మాములు రోజులలో కన్నా కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని పెద్దలు అంటారు.

దీపారాధన మహత్యం
కార్తిక పౌర్ణమి నాడు చేసే దీపారాధన వలన వచ్చే పుణ్యం అనంతం. ఈ రోజు శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినా, దీపదానం చేసిన చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన సరే ఆ పుణ్యం వెలకట్టలేనిది.

దీపారాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం
కార్తిక మాసంలో చేసే దీపారాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుని పూజించేందుకు హైందవ శాస్త్రాలు షోడశోపచారాలు నిర్దేశించారు. అందులో దీపారాధన ఒకటి. దీపాన్ని దైవ స్వరూపంగా, లక్ష్మీదేవిగా భావించి పూజించడం మన సంప్రదాయం.

జ్ఞానాంశకు ప్రతీక దీపం
ఆధ్యాత్మికపరంగా చూస్తే దీపాన్ని జ్ఞానాంశకు ప్రతీకగా చెబుతారు. ఇక్కడ ప్రమిదలోని వత్తి శరీరంగా, నూనెను కర్మఫలంగా జ్వాలను ప్రాణంగా అభివర్ణిస్తారు. మట్టి ప్రమిద అంటే భూమాతగా, ధాత్రిగా చెబుతారు. ఇక్కడ నూనె గా భావించే కర్మఫలం అనే ప్రాణం ఉన్నంత వరకు శరీరం అనే వత్తిలో ప్రాణం అనే జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కర్మఫలం అనే నూనె అయిపోతుందో అన్నీ మట్టి లో కలిసిపోతాయి. ఇదే కర్మసిద్ధాంతం. ఇదే కార్తిక దీపం వెలిగించడంలో ఉన్న ధర్మసూక్షం.

కార్తిక పౌర్ణమి పూజా విధానం
కార్తీక పౌర్ణమి నాడు శాస్త్రోక్తంగా పూజ ఎలా చేయాలో చూద్దాం. కార్తిక పౌర్ణమి రోజు ఉదయాన్నే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలి. వీలు కానీ వారు తమ తమ ఇళ్లలోనే గంగా తీర్థాన్ని నీటిలోకి ఆవాహన చేసుకొని తలారా స్నానం చేయాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్లు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివకేశవుల ఆలయంలో 365 వత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, పురాణం ప్రవచనం విని గాని, చెప్పి కానీ ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా కఠిన ఉపవాసం ఉండలేని వాళ్లు పండ్లు పాలు వంటి సాత్విక ఆహారం తీసుకొనవచ్చు.

365 వత్తులతో దీపారాధన ఎందుకు చేయాలి
ఇక 365 వత్తులతో ఎందుకు దీపారాధన చేయాలంటే కొంత మందికి సంవత్సరంలో కొన్ని రోజులు దీపారాధన చేసే అవకాశం ఉండదు. అలా చేయలేని వారు సంవత్సరంలో ఒక్కసారి కార్తిక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపారాధన చేసినట్లయితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం కలుగుతుంది.

సకల పాపహరణం జ్వాలాతోరణ దర్శనం
కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం దేవాలయాల్లో వెలిగించే జ్వాలాతోరణం దర్శించడం సకల పాపాలు హరించుకుపోయి, కోటి పుణ్యాల నిస్తుందని శాస్త్ర వచనం.

వనభోజనాలు
కార్తిక పౌర్ణమి రోజు ఉసిరిక చెట్లు ఉన్న వనంలో బంధు మిత్రులతో కలిసి సామూహికంగా చేసే వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వనభోజనాలు వలన ఆధ్యాత్మిక అనుభూతి తో పాటు సామాజిక సంబంధాలు కూడా మెరుగవుతాయి.

రానున్న కార్తిక పౌర్ణమి రోజున మనం కూడా నది స్నానం, దీపారాధన, శివకేశవుల ఆరాధన చేస్తూ, వనభోజనాలలో పాల్గొందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం.

ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details