Karthika Deepotsavam Organized by ETV in Chandragiri:ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో కార్తిక దీపోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. పోలీస్ క్వార్టర్స్ మైదానంలో నిర్వహించిన దీపోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, టీటీడీ బోర్డు మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహాయాదవ్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తదితరులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చిన మహిళలకు నిర్వహకులు పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.
వేలాది దీపాల కాంతులతో మైదానమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సంప్రదాయ వస్త్రధారణలో దీపోత్సవానికి వచ్చిన మహిళలు, యువతుల ఓంకార నాదాలు, వేదమంత్రాలతో హోరెత్తింది. దీపోత్సవంలో వెంకటేశ్వర స్వామి మహత్యంపై ఆకేళ్ల విభీషణ శ్రమ ప్రవచనం చెప్పారు. అనంతరం మహిళలతో సాముహికంగా దీపోత్సవ పూజ చేశారు. రెండు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి ప్రవత్తులతో దీపాలు వెలిగించి కైలాసనాథుడ్ని ప్రార్థించారు.