Adivaraha Kshetram : తిరుమల తిరుపతి అనగానే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి మాత్రమే గుర్తొస్తుంటారు. కానీ, స్వామి వారికంటే ముందే అక్కడ శ్రీమన్నారాయణుడు వెలసిన క్షేత్రం ఉందని చాలా తక్కువమంది భక్తులకు మాత్రమే తెలుసు. వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉండటానికి పూర్వమే శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించిన తర్వాత సాధుసంరక్షణార్థం భూలోకంలోనే ఉండిపోవడానికి అంగీకరించి వేంకటాచలంపై నివాసం ఏర్పరచుకున్నారు. తిరుమల నాటి నుంచి 'ఆదివరాహక్షేత్రం'గా పేరొందింది. తిరుమలలో మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి నివేదిస్తారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు సైతం మొదట వరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
తిరుమల కొండపై ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా పుష్కరిణి, దానిని ఆనుకుని శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఉంది. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం కాగా, ఇక్కడ ఉన్న వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తోంది.
తిరుమల కొండపై పుష్కరిణి మానవనిర్మితం కాదు. స్వయంగా ఆవిర్భవించినది. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కడం వెనుక కారణం కూడా అదే. ఈ పుష్కరిణి అసలు పేరు వరాహపుష్కరిణి. వరాహ-మార్కండేయ వామన- స్కాంద – బ్రహ్మ – భవిష్యోత్తర పురాణాల్లో ఈ పుష్కరిణి ప్రస్థావన ఉంది. మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి. దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం వెల్లడిస్తోంది. ఈ పవిత్ర స్వామి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ఉన్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం – యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ స్నానంచేసి స్వామి వారిని దర్శిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
కలియుగంలో లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా ఏడుకొండలపై వెలిశాడు. ఈ పవిత్ర క్షేత్రంలో ఎన్నో తీర్థాలున్నాయి. వాటిలో ప్రధానంగా పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం ఇలా సుమారు కోటి తీర్థాలున్నాయని భక్తుల నమ్మకం. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గర్భగుడి చుట్టూ బయటకు వెళ్లే క్రమంలో విమాన వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వేంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం చెప్తోంది. ఇక కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధారను పాపనాశనం అని పిలుస్తుంటారు. ఈ జలాల్లో స్నానం చేస్తే పాపాలు నశించిపోతాయనేది భక్తుల విశ్వాసం.