Hanuman Jayanti 2024 Significance :హనుమజ్జయంతి మంగళవారం కానీ, శనివారం కానీ వస్తే ఆ రోజును మహా పర్వదినంగా పండితులు చెబుతారు. ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమజ్జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో మంగళవారం రోజు ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా హనుమజ్జయంతి శనివారం రావడం మరీ ప్రత్యేకంగా పండితులు భావిస్తున్నారు.
హనుమజ్జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు?
రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేసి, రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది.
అసలైన హనుమజ్జయంతి ఇదే!
నిజానికి హనుమజ్జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం శనివారమే అసలైన హనుమజ్జయంతి. హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధరించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజే అసలైన హనుమంతుని జయంతి.
హనుమజ్జయంతి రోజు హనుమను ఎలా పూజించాలి?
హనుమజ్జయంతి రోజు హనుమకు తమలపాకుల దండను సమర్పించాలి. సింధూరంతో, తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి.
ఎలాంటి నైవేద్యాలు హనుమకు ప్రీతికరం?
హనుమంతునికి అరటిపండ్లు ప్రీతికరం. అందుకే హనుమజ్జయంతి రోజు హనుమకు అరటి పండ్లను సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం హనుమకు నివేదించాలి. ఇంకా హనుమంతునికి ఎంతో ఇష్టమైన వడమాల, అప్పాల మాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయని శాస్త్ర వచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డు కూడా హనుమంతునికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.