Ganagapur Dattatreya Temple History : బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయునికి దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని క్షేత్రాలలో స్వామి సశరీరులుగా నడయాడినందున ఆ క్షేత్రాలకు పవిత్రత చేకూరింది. అలాంటి వాటిల్లో ఒకటిగా భాసిల్లుతున్న గాణగాపురం క్షేత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ క్షేత్రం విశిష్టత
శ్రీ దత్తాత్రేయుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతీకగా భావిస్తారు. ఆ దత్తాత్రేయుడు కొలువు దీరిన శ్రీ క్షేత్రమే గాణగాపురం. దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు స్వయంగా నడయాడిన ఈ ప్రాంతం ప్రసిద్ధ దత్త క్షేత్రంగా విరాజిల్లుతోంది.
గాణగాపురం ఎక్కడ ఉంది?
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో గాణగాపురం క్షేత్రం ఉంది.
ఆలయ స్థల పురాణం
అత్రి మహర్షి భార్య మహా సాధ్వి అనసూయమ్మ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయ పసి బాలురుగా మార్చి వేయగా లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయను ప్రార్ధించి తమ పతులను తిరిగి పొందగా అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి అనసూయలకు త్రిమూర్తుల అంశగా దత్తుడిగా జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని రెండవ అవతారమే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించినట్లుగా కథనం. అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి దేశమంతా తీర్ధ యాత్రలు చేస్తూ చివరకు కర్ణాటకలోని గాణగాపురంకు వచ్చి 23 సంవత్సరాలు అక్కడే ఉండి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదళీ వనంలో అవతార పరిసమాప్తి గావించాడని పురాణగాథ.
పాదుకలకు పూజ
అలా నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్ధం. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఈ పాదుకలనే స్వామిగా భావించి పూజలు జరుపుతారు.
ఒళ్లు గగుర్పొడిచే నిజం
గాణగాపురం లోని స్వామి పాదుకలు రాతితో తయారు చేసినవాని భావిస్తారు కానీ నిజానికి ఈ పాదుకల లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు వాటిని పరీక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అందుకు కారణం ఏమిటంటే ఆ పాదుకలు ముట్టుకుంటే మెత్తగా దూది వలే ఉంటాయని, పాదుకలను స్పృశిస్తే నిజంగా మనిషి పాదాలు ముట్టుకున్న అనుభూతిని చెందుతారని విశ్వాసం.