Dwara Lakshmi Pooja Vidhanam :సాధారణంగా అమ్మాయిలకు సరైన వయసులో వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల వివాహం ఆలస్యం కావడం, అన్నీ కుదిరిన తర్వాత చివరి నిముషంలో వివాహం రద్దు కావడం వంటివి జరిగితే ఏదో ప్రతికూలత ఉన్నట్టు అని శాస్త్రం చెబుతోంది. ఇలాంటప్పుడు పెళ్లి కావలసిన అమ్మాయి చేత శుక్రవారం ద్వార లక్ష్మీ పూజ చేయిస్తే వివాహం కుదరడం మాత్రమే కాదు మంచి సంబంధం కుదురుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ద్వార లక్ష్మీ పూజ విధానం
వివాహం కావలసిన అమ్మాయిలు శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి ఈ రోజు నుంచి 16 శుక్రవారాలు ద్వార లక్ష్మీ పూజ చేస్తానని అమ్మవారి సమక్షంలో సంకల్పించుకుని ఎర్రటి వస్త్రంలో కొబ్బరి కాయను ముడుపుగా కట్టుకోవాలి.
గడప పూజ ఇలా
తర్వాత ఇంటి గుమ్మానికి ఉన్న గడపను ముందుగా పచ్చి పాలతో శుభ్రంగా తుడవాలి. తరువాత నీటితో గడపను తుడవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. గడపకు ముందు పసుపు రాసి, అదే పసుపు చేతులతో పాదాలకు పసుపు రాసుకోవాలి. తర్వాత గడపకు కుంకుమ బొట్లు పెట్టాలి. రెండు ప్రమిదలలో ఆవు నేతిని పోసి దీపాలు వెలిగించి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి. గడపకు రెండువైపులా పువ్వులను ఉంచాలి.
లక్ష్మీనారాయణుల పూజ
గడప పూజ పూర్తయ్యాక పూజా మందిరంలో దేవుని సమక్షంలో లక్ష్మీనారాయణుల అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. తరువాత నైవేద్యం సమర్పించి గడపకు హారతి ఇవ్వాలి. ఇలా 16 శుక్రవారాలు గడప పూజ చేసినట్లయితే వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలు పోయి సత్వరమే వివాహం అవుతుందని శాస్త్ర వచనం.
పూజలో పాటించాల్సిన నియమాలు
గడప పూజ చేసే అమ్మాయిలు పూజ పూర్తయ్యేవరకు పూర్తి ఉపవాసం ఉండాలి. వీలుకాని రోజులను విడిచిపెట్టి పూజ చేయవచ్చు. మొత్తం 16 శుక్రవారాలు ఈ పూజను చేసుకోవాలి. 16 వారలు పూర్తయ్యాక చివరి రోజు ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ తాంబూలం ఇచ్చి, భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ముడుపు కట్టిన కొబ్బరికాయను నదీజలలో నిమజ్జనం చేయాలి. పూజ చేసే శుక్రవారం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. పూజను ఏదో మొక్కుబడిగా కాకుండా భక్తి శ్రద్ధలతో భగవంతునిపై పూర్తి విశ్వాసంతో చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి లేని పూజ వ్యర్థమని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఈ పూజకు భక్తి ప్రధానం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.