Diwali 2024 Special Story:నరకాసురుణ్ణి సంహరించిన ఆనందంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకొనే పండగ.. దీపావళి. ఆ తర్వాతి కాలంలో.. ఇది దీపాల పండుగగా, టపాసులు కాలుస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా చేసుకొనే వేడుకగా మారింది. కాగా శ్రీకృష్ణుడు, సత్యభామ నరకుణ్ణి వధించారని అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ వధించారో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే దీపావళి పర్వదినం వేళ ఆ విశేషాలు మీకోసం..
సత్యభామ యుద్ధం చేసింది ఇక్కడే: ద్వాపరయుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. శివుడి కోసం ఘోర తపస్సు చేసి, తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు నరకుడు. ఒకనాడు వేటకు వెళ్లగా జంతువుని చంపడానికి వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగులుతుంది. దీంతో అతడు మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నరకుడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో చెప్పాలని గురువును ఆశ్రయిస్తాడు. జరిగింది తెలుసుకున్న గురువు.. "కృష్ణానదీ తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఆ స్వామిని పుష్కరకాలం పాటు ఆరాధించడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందగలవు" అని వివరాలు చెబుతాడు. దీంతో నరకుడు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నడకుదురు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని పూజిస్తూ ఉంటాడు. అప్పుడే తనకున్న రాక్షస ప్రవృత్తి వల్ల ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి, హింసించసాగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన మహిళలు.. తమను రక్షించాలని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. సత్యభామా సమేతుడై అక్కడకు వచ్చిన స్వామి.. మహిళలందరినీ ఆ రాక్షసుడి బారిన నుంచి రక్షిస్తాడు.
అందుకు ఆగ్రహించిన నరకాసురుడు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ యుద్ధంలో పరమేశ్వరుడి వరం వల్ల శ్రీకృష్ణపరమాత్ముడు కొద్దిసేపు స్పృహ కోల్పోతాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన సత్యభామ.. యుద్ధ రంగంలోకి దూకి నరకుడిని సంహరిస్తుంది. అందుకే ఈ ఆలయానికి నరకోత్తరక్షేత్రంగా పేరొచ్చింది. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశినాడు నరకుని పీడ వదిలింది గనక ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ఆరోజున ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది. కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా ప్రస్తుతం నడకుదురుగా ప్రసిద్ధి చెందింది. నరక సంహారానికి గుర్తుగా ఇప్పటికీ ఇక్కడ నరకచతుర్దశి నాడు నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.
నరకాసుర సంహారం అనంతరం శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై.. ఇక్కడ వెలిసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీకృష్ణుడు.. దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల ప్రతిమలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి.