తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆదివారం నుంచే బోనాల సందడి- ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? - Bonalu 2024

Bonalu Festival 2024 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వచ్చేసింది. ఆషాఢ మాసంలో తెలంగాణాలో జరిగే అతిపెద్ద జాతర బోనాలు. ఆషాఢమాసంలో ఒక్కో వారంలో వివిధ ప్రాంతంలో జరిగే బోనాలు అంతర్జాతీయంగా కూడా ఖ్యాతికెక్కింది. బోనాల పండుగ త్వరలో ప్రారంభం కానున్న సందర్భంగా అసలు బోనాలు ఎలా మొదలయ్యాయి? ఎందుకు జరుగుతుంది అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Bonalu Festival 2024
Bonalu Festival 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 3:39 PM IST

Bonalu Festival 2024 : తెలంగాణ బోనాల పండుగ అంటే ఒక ఇంటికో లేదా ఏదైనా ఊరికో పరిమితమయింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే బోనాల పండుగ వెనుక ఎన్నో ఆసక్తి కలిగించే విశేషాలు.

బోనం అంటే ఇదే
తెలుగు భాషలో ప్రకృతి వికృతి పదాలలో భోజనం అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం. అమాయకపు భక్తులు అమ్మవారికి ప్రేమగా అందించే భోజనమే బోనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుంది.

ఘన చరిత్ర
దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తోంది.

తొలి బోనం ఇక్కడే
ప్రతాప రుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఆనాటి నుంచి భాగ్యనగరంలో గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం సంప్రదాయంగా వస్తోంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, బోనం ఎత్తుతారు. మూడో వారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగో వారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు.

బోనాల వెనుక ఆచారం
తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చీర, సారెలు సమర్పిస్తారని విశ్వాసం. ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో, అదే విధంగా, భక్తులు అమ్మవారికి ఆప్యాయత అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలు సమర్పిస్తారు.

అమ్మవారి వివిధ రూపాలు
జగదాంబిక అయిన ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలందుకుంటూ ఉంటుంది. మహంకాళి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ ఇలా పేర్లు వేరైనా తల్లి ఒక్కటే.

బోనాల జాతర ఇలా జరుపుకోవాలి?
బోనాల జాతర జరిగే ఆదివారం రోజు భక్తులు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకొని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు. తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పు గాళ్లు ముందు నడుస్తుండగా మహిళలు ఆ కుండను తలమీద పెట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం తరువాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరిస్తారు.

ఇలా కూడా చేయవచ్చు
ఆలయంలో బోనం వండి సమర్పించలేనివారు అమ్మవారికి బియ్యాన్ని కూడా సమర్పించవచ్చు.

మొక్కులు ఇలా
బోనాల సందర్భంగా తమను ఆపదల నుంచి గట్టెకించినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్లు, మేకలను కూడా బలి ఇస్తుంటారు. ఇవన్నీ విశ్వాసం మీద ఆధారపడిన విషయాలు. బోనాల సందర్భంగా కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులు చేసే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

రంగం - భవిష్యవాణి
బోనాల జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం భవిష్యవాణి. అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా వినిపించే భవిష్యవాణి కీలకం. భవిష్యవాణిలో వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పడం, ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే ఏమి చేయాలనే విషయాలు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది.

తెలుగు జాతికే గర్వకారణం
పలహార బళ్లు, పోతురాజుల విన్యాసాలు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే రంగం భవిష్యవాణి వంటి అంశాలతో కూడిన బోనాలు ఒక్క తెలుగు జాతికే సొంతం. ఈ రోజు దేశవిదేశాలలో కూడా బోనాలు ఘనంగా జరుపుతున్నారంటే అది మన తెలుగు జాతికే గర్వకారణం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఏటా కొత్త రథం- 12రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగన్నాథుడి రథయాత్ర విశేషాలివే! - Puri Rath Yatra 2024

ఆషాఢంలో విశిష్ట పండుగలు, నెలంతా విశేషాలే! సుబ్రమణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లికి లైన్​ క్లీయర్! - Ashada Masam 2024

ABOUT THE AUTHOR

...view details