Ghati Subramanya Temple History :కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి, స్వామి అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ క్రమంలో ఆది సుబ్రహ్మణ్యుని క్షేత్రం కుక్కే గురించి ఇదివరకే తెలుసుకున్నాం. అందుకే ఈ కథనంలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం.
ఘాటి సుబ్రమణ్య క్షేత్రం ఎక్కడుంది?
ఘాటి సుబ్రమణ్య క్షేత్రం బెంగుళూరు నగరానికి 60 కి.మీ దూరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని మొదట సండూర్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించిన ఘోర్‌పడే పాలకులు అభివృద్ధి చేశారు.
ఆలయ విశేషాలు
ఘాటి సుబ్రమణ్య ఆలయం లోని ముఖ్య విశేషమేమిటంటే గర్భాలయంలోని ప్రధాన దైవం కార్తికేయుడు, నరసింహ స్వామితో కలిసి కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం, ఈ రెండు విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని విశ్వాసం. స్వయంభువుగా వెలసిన ఏడు తలల నాగుపాముతో ఉన్న కార్తికేయ విగ్రహంకు వెనుక వైపున నరసింహ స్వామి విగ్రహం ఉంటుంది. కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. భక్తులు కార్తికేయుని, నరసింహ స్వామిని ఏకకాలంలో దర్శించేలా గర్భగుడిలో వెనుక భాగంలో భారీ అద్దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.
ఆలయ స్థల పురాణం
సుబ్రహ్మణ్యుడు ఘాటికాసురుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడని అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రమని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఘాటికాసురుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడే సర్ప రూపంలో తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. అలాగే విష్ణుమూర్తి వాహనం అయిన గరుడుడు సర్పాలకు శత్రువు కాబట్టి గరుడుని వల్ల ఏ ఆపద రాకుండా సుబ్రహ్మణ్యుడు విష్ణువును ప్రార్ధించగా స్వామి ఇక్కడే నరసింహావతారంలో సర్పాలకు రక్షకుడుగా వెలిశాడని స్థలపురాణం చెబుతోంది.