Ashada Masam 2024 : తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలు పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిధి రోజున ఉండే నక్షత్ర ఆధారంగా ఏర్పడతాయి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢం.
శుభకార్యాలు నిషిద్ధం
ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్తుకు ధనధాన్యాలు, పశుసంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది.
శూన్యమాసం కాదు శుచిమాసం
ఆషాడంలో శుభకార్యాలు జరుగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు కానీ నిజానికి ఆషాఢం శుచిమాసం. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు, ఉండేవి. ఆషాఢంలో వీటన్నింటిని శుభ్రపరచుకునే ఆచారం అందరూ పాటించేవారు. అలాగే వెండి బంగారం వంటి ఆభరణాలను కూడా ఈ మాసంలోనే మెరుగు పెట్టించుకోవడం, శుభ్రపరచుకోవడం వంటివి చేసుకునేవారు.
సంధిమాసం
వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్నిసంధిమాసం అని కూడా అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చేమార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయి. అంటురోగాలు ప్రబలుతాయి. చర్మవ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం వచ్చింది. మనుష్యులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా అంటు రోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆధ్యాత్మికతకు అనువైన మాసం
ఆషాఢంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం పవిత్రమైన మాసం. ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడా సందడిగా ఉంటుంది. ఈ నెలరోజులు గ్రామదేవతల పేరుతో వెలసిన అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం వంటి వాటితో ఊరు ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపుకుంకుమలతో అమ్మవారికి చీరెలు, సారెలు సమర్పిస్తారు.
ఆషాఢ మాసంలోని పర్వదినాలు
- ఆషాఢం పెడుతూనే వచ్చే అతి పెద్ద పండుగ పూరీ జగన్నాధుని రథయాత్ర. మోక్ష ద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరీ జగన్నాధుని రథయాత్ర చూడటానికి లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు.
- అలాగే వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాడ మాసం పెడుతూనే ప్రారంభం అవుతాయి.
- ఆషాఢశుద్ధ షష్టి రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే అవివాహితులకు శ్రీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది.
- ఆషాఢశుద్ధ సప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటాం. ఈ రోజు రాత్రీపగలూ సరిసమానంగా ఉంటాయి.
- ఇక ఆషాఢశుద్ధ ఏకాదశి విశేషమైన పర్వదినం. దీనినే తొలిఏకాదశి అని శయనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటాడని అంటారు. అందుకే ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు.
- ఈ రోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు చాతుర్మాస వ్రత దీక్షను ప్రారంభిస్తారు. నాలుగు నెలలపాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది.
- ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. ఈ రోజు శ్రీవైష్ణవులందరు గోదాదేవిని ఆండాళ్ గా ఆరాధించి ఆ జగన్మాత రచించిన పాశురాలను భక్తితో పారాయణ చేస్తారు.
- ఆషాఢ పౌర్ణమిని గురుపూర్ణిమ అని వ్యాసపూర్ణిమ అని జరుపుకుంటాం. శ్రీమన్నారాయణుని స్వరూపమైన వ్యాసభగవానుని జన్మదినమైన ఈ రోజున గురుపూజ పేరుతో గురువులను ఆరాధించడం ఆనవాయితీ.
- ఆషాఢ బహుళ సప్తమి భోగ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజు చెట్లు చేమలను పూజించడం, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు.
- ఆషాఢ బహుళ ఏకాదశి కామదా ఏకాదశిగా జరుపుకుంటాం. కామము అంటే కోరిక. ఇహలోక కోరికలను తీర్చి మోక్షమనే శాశ్వత కోరికను తీర్చమని కోరుకుంటూ అమ్మవారిని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు.
- ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక విశేషాలున్న ఆషాఢ మాసంలో దేవీదేవతలు, గురువులను ఆరాధిద్దాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం.
శుభం భూయాత్
ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
నరఘోష, దృష్టిదోషాలు పోగొట్టే వారాహి దేవి- ఈ నవరాత్రులు ఎంతో ప్రత్యేకం! - Varahi Ammavari Navaratri Pooja
మొండి వ్యాధులను నయం చేసే 'యోగిని ఏకాదశి'! వ్రతం ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి! - Yogini Ekadashi 2024