Annamayya Life Story In Telugu : తిరుమల శ్రీనివాసునిపై దాదాపు 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీవైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది.
అన్నమయ్య జననం
అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. నారాయణ సూరి గొప్ప పండితుడు. లక్కమాంబ చెన్నకేశవ స్వామికి మహా భక్తురాలు. ఆమె మధురంగా పాడుతుంది. ఈమెతో కడప జిల్లాలోని మాడువూరులో చెన్నకేశవస్వామి ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు. మొక్కని దైవం లేదు.
ఒకసారి తిరుమల వెంకన్నను దర్శించుకోడానికి తిరుమలకు వెళ్లి స్వామి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయగా ఆ సమయంలో శ్రీనివాసుని చేతిలోని ఖడ్గం నుంచి దివ్య కాంతి పుంజం లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించిందంట! అనంతరం లక్కమాంబ గర్భం ధరించి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఆ పసి బిడ్డే అన్నమయ్య.
తిరుమల ప్రయాణం
చిన్ననాటి నుంచి అన్నమయ్య వెంకన్న పేరు చెబితే కానీ ఉగ్గుపాలు కూడా తాగేవాడు కాదంట. అలా చిన్నప్పుడు మొదలైన భక్తి అన్నమయ్యతో పాటు పెరిగి పెద్దదయింది. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. ఒకసారి అన్నమయ్య గడ్డి కోసుకురావడానికి అడవికి వెళ్లగా పొరపాటున చెయ్యి తెగి రక్తం కారుతుండగా మైకం వచ్చి కళ్లు తిరిగి పడిపోతాడు. తర్వాత వచ్చిన పని మర్చిపోయి తిరుమలకు వెళుతున్న భక్త బృందంతో కలిసి గోవిందా! గోవిందా అంటూ తిరుమలకు బయల్దేరాడు.
అలమేలుమంగమ్మ సాక్షాత్కారం
కొండకు బయలుదేరిన అన్నమయ్య ఎన్ని రోజులైనా కొండకు చేరలేక పోతాడు. ఆహారపానీయాలు లేక మైకం కమ్మి ఉన్న సమయంలో ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని తినిపించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని చెబుతుంది. ఆ సమయంలో అన్నమయ్య పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ శ్రీ వేంకటేశ్వర శతకము రచించాడు.
వెంకన్న తొలి దర్శనం
తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. అనంతరం సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీనివాసుని దివ్య దర్శనం చేసుకున్నాడు. తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ వైష్ణవ మతాన్ని స్వీకరించి తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.
వివాహం
అన్నమయ్య నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. తిమ్మక్క, అక్కమ్మ అనే ఇద్దరినీ వివాహం చేసుకుంటాడు అన్నమయ్య. తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలను దర్శించిన అన్నమయ్య ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. ఆనాటి నుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు కీర్తిస్తుండగా ఆయన శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలపై నిక్షిప్తం చేయసాగారు.
తీర్థయాత్రలు
అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్థయాత్రలకు బయలుదేరి తొలుత చెన్నకేశవ స్వామిని దర్శించుకొని తర్వాత ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు.