Sri Sampath Vinayagar Temple History : హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుని పూజించకుండా ఏ పనినీ ప్రారంభించరు. ఇక కొత్తగా కొన్న వాహనాలకు అయితే వినాయకుని గుడిలో పూజ చేయించాల్సిందే. విశాఖ నగరానికే తలమానికంగా భావించే ఓ గణనాథుని ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
విశాఖ నగరానికి మణిహారం - సంపత్ వినాయకుని మందిరం
సువిశాల సుందరమైన విశాఖ నగరానికి మణిహారం సంపత్ వినాయకుని మందిరం, విశాఖకు వెళ్లిన వారు ఈ ఆలయాన్ని దర్శించకుండా తిరిగిరారు. అలాగే విశాఖ నగరవాసులు ప్రతిరోజూ స్వామి దర్శనం తర్వాతనే తమ పనులు ప్రారంభించడం ఆనవాయితీ.
పాకిస్థాన్ సబ్‌మెరైన్ ఘాజీని ముంచేసిన బొజ్జ గణపయ్య
1971 సంవత్సరంలో ఇండియా - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో, తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్‌ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తరువాత కొద్దిరోజులకే విశాఖ పై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్థాన్ సబ్‌మెరైన్ PNS ఘాజీ 4 డిసెంబర్ 1971న సముద్రంలోనే పేలి, మునిగిపోయింది.
ఘాజీ నాశనం స్వామి మహిమే!
సంపత్ గణపతి వల్లే పాకిస్థాన్ సబ్‌మెరైన్‌ని విజయవంతంగా పేల్చి వేయగలిగామని భావించిన కృష్ణన్ ఆనాటి నుంచి విశాఖలో ఉన్నంత వరకూ ప్రతీ రోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లేవారట. ఆ ఘటన తరువాత వైజాగ్‌లోని సంపత్ వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నిజంగా ఇక్కడ స్వామిని మహిమాన్వితుడని భక్తులు అంటారు.
ఆలయ స్థల పురాణం
తమిళ వ్యాపారులు ఏర్పాటు చేసిన వాస్తు గణపతి
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల సంపత్ వినాయక మందిరాన్ని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టించారని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
తమిళ కుటుంబీకులు కట్టించిన ఆలయం
1962వ సంవత్సరంలో ఎస్జీ సంబందన్, టీఎస్ సెల్వంగనేషన్, టీఎస్ రాజేశ్వరన్ - తమ కుటుంబ సభ్యులు పూజించుకోవడం కోసం వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలోనే సంపత్ గణపతి ఆలయాన్ని నిర్మించారంట. అంతేకాదు ఈ ఆలయ నిర్వహణ మొత్తం వారి సొంత ఖర్చులతోనే చేసేవారంట. సంబధన్ నిర్మించాడు కాబట్టి సంబందన్ వినాయగర్గా పూజలందుకుంటూ కాలక్రమేణా ఈ గణపతి సంపత్ వినాయకుడిగా మారాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
మత్స్యకారుల నిత్యపూజలు
స్థానికంగా నివసించే జాలర్లు ప్రతి రోజు సంపత్ వినాయకుని దర్శించి, భక్తితో దీపం పెట్టి పూజలు చేసిన తర్వాతనే సముద్రంపైకి చేపలు పట్టడానికి వెళ్లేవారంట.
కంచి స్వామి వారిచే యంత్ర ప్రతిష్ఠాపన
కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1966-67 ప్రాంతంలో ఈ ఆలయంలో 'మహాగణపతి యంత్రాన్ని' ప్రతిష్ఠించారు. దానితో విశాఖ చుట్టుపక్కలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సంపత్ వినాయక మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.
వాహన పూజకు ప్రత్యేకం
విశాఖ నగరంలో ఎవరైనా కొత్త వాహనం కొంటే వాహన పూజకు తప్పకుండా సంపత్ గణపతి ఆలయానికి రావాల్సిందే. సైకిల్ మొదలుకొని బెంజ్ కారు వరకు సంపత్ వినాయక ఆలయంలో పూజ చేశాకే రోడ్డెక్కాలి. అదీ ఇక్కడి ప్రజల నమ్మకం. అలా పూజ చేయించడం సర్వ శుభప్రదమని, ఇక్కడ పూజలు చేసిన వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగదని భక్తుల నమ్మకం అందుకే, ఈ ఆలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.
వేలాదిమంది భక్తులు సందర్శన
సకల విఘ్నాలను హరించి తనను కొలిచే వారికి సంపదలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన సంపత్ వినాయకుని దర్శించి, అర్చించినంతనే ఎన్నో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంపత్ గణపతి ఆలయాన్ని ప్రతి నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించుకుంటారు. ముఖ్యంగా బుధ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పర్వదినాల్లో ఈ ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది.
పూజలు - ఉత్సవాలు
సంపత్ వినాయగర్ ఆలయంలో ప్రతి నిత్యం 'గరిక పూజ', 'ఉండ్రాళ్ళ నివేదన', 'అభిషేకము', 'గణపతి హోమం', 'వాహన పూజలు' విశేషంగా జరుగుతాయి. ప్రతీ మాసంలో బహుళ చతుర్థి నాడు జరిగే 'సంకష్టహర చతుర్థి' పూజ కన్నుల పండువగా జరుగుతుంది. ఈ రోజున స్వామికి జరిగే అభిషేకము చాలా వైభవంగా ఉంటుంది. గంధోదకం, హరిద్రోదకం, ఆవుపాలు,పెరుగు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫల రసాలు, తేనె, శుద్ధోదకం, పంచదారతో స్వామివారికి అభిషేకం ఏంతో నేత్రానందంగా నిర్వహిస్తారు. తరువాత, అర్చకస్వాములు, స్వామివారికి చేసే అలంకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
గణేశ్ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అలంకారం
సంపత్ వినాయగర్ ఆలయంలో భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని 9 రోజుల పాటు గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో స్వామివారిని బాల గణపతి, ఆది గణపతి, విద్యా గణపతి, రాజ గణపతి, శక్తి గణపతి, శివపూజ గణపతి, స్కంద గణపతి, అగస్త్యపూజ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి అనే తొమ్మిది అవతారాలలో అలంకరిస్తారు.
అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు
వినాయక చవితి ఉత్సవాలలో, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన సంతర్పణలు విశేషంగా నిర్వహిస్తారు.
తమిళ తెలుగు మేళవింపు
సంపత్ వినాయకుని ఆలయంలోని పూజలు, ఉత్సవాలు అన్నీ దీనిని స్థాపించిన సంబధన్ కుటుంబీకులు వారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరగడం విశేషం. అందుకే ఈ ఆలయంలో తెలుగు - తమిళ సంప్రదాయాల కలయికలో పూజలు జరుగుతుంటాయి.
సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు
సంపత్ వినాయకుని భక్తితో దర్శిస్తే కోరిన సంపదలు ఇస్తాడని భక్తుల విశ్వాసం. భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు. విశాఖపట్నం వెళ్లినప్పుడు తప్పకుండా సంపత్ వినాయకుని దర్శిద్దాం. సకల సంపదలను పొందుదాం.
ఓం శ్రీ గణేశాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.