తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కల్యాణ ప్రాప్తిని కలిగించే 'ఆదిపూరం'! భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే శీఘ్ర వివాహం! - Andal Jayanthi 2024 - ANDAL JAYANTHI 2024

Andal Jayanthi 2024: లక్ష్మీదేవి అవతారంగా భావించే గోదాదేవి జయంతిని తమిళనాట ఆదిపూరం అనే పేరుతో పెద్ద పండుగలా జరుపుకుంటారు. అసలు ఆదిపూరం అంటే ఏమిటి? గోదాదేవి జయంతిని ఆదిపూరం అని ఎందుకంటారు అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Andal Jayanthi 2024
Andal Jayanthi 2024Etv Bharat (Gettyimages)

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 5:08 AM IST

Andal Jayanthi 2024:ఆషాఢమాసంలో వచ్చే పూర్వ ఫల్గుణి నక్షత్రం శ్రీ గోదాదేవి జన్మ నక్షత్రం. దీనినే తిరు నక్షత్రం అని కూడా అంటారు. ద్రవిడ భాషలో 'తిరు' అంటే 'శ్రీ' అని అర్థం. అమ్మవారు జన్మించిన శుభ నక్షత్రాన్ని తిరు నక్షత్రంగా భావించి ఈ రోజు వేడుకగా ఉత్సవాలు జరుపుతారు. ద్రవిడ సంప్రదాయం ప్రకారం 'ఆది' అంతే ఆషాఢమాసాన్ని, 'పూరం' అనేది పూర్వా ఫల్గుణి నక్షత్రాన్ని సూచిస్తుంది. ఆదిపూరం అంటే ఆషాఢమాసంలో వచ్చే పూర్వఫల్గుణి శుభ నక్షత్రం రోజు.

ఆదిపూరం ఎప్పుడు
ద్రవిడ సంప్రదాయం ప్రకారం పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది. జూలై 21 వ తేదీ నుంచి ఆగస్టు 19 వరకు ద్రవిడ పద్ధతి ప్రకారం ఆషాఢ మాసం అంటే 'ఆది' మాసం కాబట్టి ఈ నెలలో వచ్చే పూర్వఫల్గుణి నక్షత్రం రోజున ఆదిపూరంగా జరుపుకుంటారు. ఆగస్టు 7 వ తేదీ పూర్వఫల్గుణి నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజునే ఆదిపూరంగా, ఆండాళ్ జయంతిగా జరుపుకుంటారు.

ఆదిపూరం ప్రాముఖ్యత
ఆది అంటే ఆషాఢ మాసం ఆదిపరాశక్తి పూజకు విశిష్టమైనది. ఈ మాసంలో అమ్మవారి శక్తి విశేషంగా ఉంటుందని అంటారు. ప్రత్యేకించి ఆదిపూరం రోజు పార్వతీ దేవి తన భక్తులను అనుగ్రహించడానికి భూమికి దిగివస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు అన్ని శక్తి దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు జరుపుకుంటారు. ఇంతటి పవిత్రమైన రోజున జన్మించిన గోదాదేవి జననం గురించి తెలుసుకుందాం.

గోదాదేవి జననం
పూర్వం విష్ణుచిత్తుడు అనే వైష్ణవ బ్రాహ్మణుడు శ్రీవిల్లిపుత్తూరులో నివసించేవాడు. శ్రీరంగనాథునికి పరమ భక్తుడైన విష్ణు చిత్తునికి సంతానం లేకపోవడంతో తన కష్టాలను తీర్చమని విష్ణువును ప్రార్థించాడు. ఒకరోజు అతను శ్రీరంగనాథుని పూజకు పూలు కోస్తుండగా ఆ పూల వనంలో ముద్దులొలికే పసిపాప కనిపించింది. విష్ణుచిత్తుడు ఆ బాలికను భగవంతుడు ఇచ్చిన బిడ్డ లాగా భావించి తన ఇంటికి తెచ్చుకుని ఆండాళ్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. ఈమెనే గోదాదేవి అని కూడా పిలుస్తారు.

శ్రీరంగనాథుని మీద భక్తిపారవశ్యం
గోదాదేవికి శ్రీరంగనాథుడు అంటే ఎంతో భక్తి పారవశ్యాలు ఉండేవి. శ్రీరంగుని పూజకు ఆమె ప్రతినిత్యం పూలమాలలు తయారు చేస్తూ ఉండేది. అంతేకాదు ఆ శ్రీరంగనాథుని తన భర్తగా భావించి రంగనాథుని పూజ కోసం సిద్ధం చేసిన పుష్ప మాలికలను తాను ముందుగా ధరించి సరస్సులో తన అందాన్ని చూసుకొని మురిసిపోతుండేది. కొంతకాలం ఇలా సాగిన తర్వాత ఒకనాడు విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుని పూజ కోసం సిద్ధం చేసిన మాలలో వెంట్రుకలు ఉండడం గమనించి ఆ విషయాన్నీ గురించి గోదాదేవిని అడుగుతాడు. అప్పడే ఆయన గోదాదేవి శ్రీరంగనాథుని పూజకు సిద్ధం చేసే మాలలను ముందుగా తాను ధరిస్తోందని గుర్తించి మందలిస్తాడు.

ఆ తర్వాత నుంచి ఆయన గోదాదేవి ధరించక ముందే పుష్ప మాలలను శ్రీరంగనాథుని పూజకోసం తీసుకెళ్తే శ్రీరంగడు వాటిని స్వీకరించాడు. తనకు గోదాదేవి ధరించిన మాలాలంటేనే ఇష్టమని చెబుతాడు. ఆ విధంగా ఆండాళ్ శ్రీరంగనాథుని గర్భాలయంలోకి ప్రవేశించి అతనిలో ఐక్యం అయిపోతుంది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ చేసిన ముప్పయి పాశురాలను ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయాల్లో జరిగే తిరుప్పావై సేవలో ముప్పై రోజులపాటు కీర్తిస్తారు. చివరి రోజు శ్రీ గోదారంగనాయకుల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

ఆదిపూరం ఇలా జరుపుకుంటారు
ఆది పూరం రోజు అన్ని వైష్ణవ దేవాలయాలలో హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆండాళ్ జన్మస్థలమైన శ్రీవల్లిపుత్తూరులో ఆది పూరం వైభవంగా జరుపుకుంటారు. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా ఈ పండుగను 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. 10వ రోజున, ఆండాళ్ శ్రీరంగనాధునికి అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. వివాహం కాని కన్యలు ఈ కల్యాణోత్సవంలో పాల్గొంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఆదిపూరం వ్రత ఫలం
ఆదిపూరం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే వివాహం కావాల్సిన వారికి శ్రీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సత్సంతానం కలుగుతుంది. ఆదిపూరం ఉత్సవాలలో పాల్గొన్న వారికి ఐశ్వర్యప్రాప్తి సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్ర వచనం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేస్తున్నారా? మరి వ్రత కథ గురించి తెలుసా? - Mangala Gowri Vratham

సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం! కపిల తీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరం!! - Kapila Theertham Kapileshar Temple

ABOUT THE AUTHOR

...view details