Aadi Krithigai 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 28 నక్షత్రాలు వస్తుంటాయి. ఇందులో కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడి జన్మ నక్షత్రమని శివ మహా పురాణం, స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యుని ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యుని పూజకు శుభ సమయం
కృత్తికా నక్షత్రం జులై 29వ తేదీ సోమవారం ఉదయం 10 :57 నిమిషాలకు మొదలై జులై 30వ తేదీ మంగళవారం ఉదయం 10: 22 నిమిషాల వరకు ఉంది.
ఆడికృత్తిక - సుబ్రహ్మణ్యుని పూజా విధానం
తమిళనాట ఆడికృత్తిక పెద్ద పర్వదినంగా జరుపుకొంటారు. ఈ రోజు సంతానం కోరుకునే వారు నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియై ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అలాగే వినాయకుడు, శివపార్వతుల చిత్రపటాలను కూడా ప్రతిష్టించుకోవాలి. సుబ్రహ్మణ్యుని ఎరుపు రంగు పూలతో పూజించాలి. ఎర్ర చందనం సమర్పించాలి.
పిండి దీపాలు
ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్యం పిండి, బెల్లం ఆవు నెయ్యితో తయారు చేసిన చలిమిడితో 5 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ప్రమిదల్లో ఆవు నేతిని వేసి ఒక్కో ప్రమిదలో రెండేసి వత్తులు వేసి దీపారాధన చేయాలి. నువ్వులు, బెల్లం, నెయ్యి కలిపి చేసిన చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు షణ్ముఖునికి నివేదించాలి. చివరలో తాంబూలం సమర్పించి సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని దైవ ప్రసాదంగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. ఆడికృత్తిక ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది.
ఆలయాలలో ఇలా పూజలు
ఈ రోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారు ఈ రోజు సుబ్రహ్మణ్యుని మొక్కి కావిళ్లు ఎత్తుతారు. కావిళ్లు ఎత్తలేని వారు ఈ కావిళ్ల కిందనుంచి వెళ్లినా సంతానం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజు అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే ఈ కావిళ్ల ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.